కలిమిశ్రీకి జాషువా పురస్కారం
ప్రముఖ సాహితీవేత్త, నవమల్లెతీగ సాహిత్య పత్రిక సంపాదకుడు, నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ (కలిమికొండ సాంబశివరావు) తెలుగు సాహిత్యానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా గుర్రం జాషువా స్మారక కళాపరిషత్ జాషువా పురస్కారం ప్రకటించింది. ఏప్రిల్ 23న తెనాలిలో జరిగే కళాపరిషత్ 35వ వార్షికోత్సవంలో కలిమిశ్రీని ‘సాహితీ తపస్వి’ బిరుదుతో సత్కరించనున్నట్లు జాషువా స్మారక కళాపరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెద్దింటి యోహాన్ తెలిపారు. కలిమిశ్రీ మూడున్నర దశాబ్దాలుగా పత్రికారంగంలోనే కొనసాగుతున్నారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, జ్యోతిచిత్ర పత్రికల్లో పని చేశారు. సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహిత్యంలో కొత్తతరాన్ని తయారుచేసే బాధ్యత తీసుకున్నారు. 2007 నుంచి నవమల్లెతీగ మాసపత్రికకకు వ్యవస్థాపక సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు . మల్లెతీగ పురస్కారంతో గత పదేళ్లుగా ఎంతోమంది కవుల్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు.

కవి సమ్మేళనాలు, కథ, కవిత, గజల్ ఇతర సాహిత్య ప్రక్రియలపై అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. సాహిత్యరంగంలో ఉద్దండులైన ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కె.శివారెడ్డి, ఆచార్య కొలకలూరి ఇనాక్, పాపినేని శివశంకర్, విహారి, గోరటి వెంకన్న, గజల్ శ్రీనివాస్, జి.లక్ష్మీనరసయ్య, రసరాజు, కొప్పర్తి, కీ.శే. డాక్టర్ అద్దేపల్లి రామమోహన్ రావు తదితర సాహితీమూర్తులతో ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవలే కరోనా విజృంభణ తర్వాత సాహిత్య కళా రంగాల్లో ఏర్పడ్డ శూన్యతను కరిగించి కొత్త చైతన్యాన్ని నింపేలా మిత్రుల సహకారంతో విజయవాడలో ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు’ జరిపి అందరి ప్రశంసలు అందుకున్నారు. మల్లెతీగ ముద్రణ విభాగాన్ని నెలకొల్పి సొంతంగా పుస్తకాలు అచ్చేసుకోవాలన్న కవులు, రచయితల ఆకాంక్షలకు అనుగుణంగా తక్కువ ధరకే పుస్తకాల్ని అందంగా ముద్రిస్తున్నారు. వాటి ఆవిష్కరణల బాధ్యతను కూడా తలకెత్తుకుని విజయవాడలో అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. సాహిత్య కార్యక్రమాల నిర్వాహకులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

