అర్ధరాత్రి అరెస్ట్ డ్రామా తర్వాత బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు బెయిల్
బుధవారం అర్ధరాత్రి నాటకీయపరిణామాల మధ్య అరెస్టయిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్‌కు బెయిల్ మంజూరైంది. బుధవారం, సంజయ్‌ను కోర్టు రెండు వారాలు రిమాండ్ విధించింది. మంగళవారం రాత్రి పోలీసు కస్టడీలోకి తీసుకున్న కరీంనగర్ ఎంపీని పదో తరగతి పరీక్షా పత్రాల లీక్‌పై అరెస్టు చేశారు. ఐతే బీఆర్ఎస్ కుట్రపూరితంగా లీకేజీ వ్యవహారాన్ని తీసుకొచ్చిందని బీజేపీ కొట్టిపారేసింది. అరెస్టు భారీ రాజకీయ దుమారాన్ని రేపింది. మొత్తం వ్యవహారంపై ఢిల్లీ బీజేపీ పెద్దలు సైతం మండిపడ్డారు. ఎటువంటి వివరణ లేకుండా రాత్రి 11 గంటలకు అతని ఇంటి నుండి అదుపులోకి తీసుకున్నారని రాష్ట్ర బీజేపీ విమర్శించింది. ఆ తర్వాత సంజయ్‌ను పలు పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ… కావాలని కుట్రపూరితంగా వ్యవహరించారని బీజేపీ మండిపడింది. వరంగల్ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని బీజేపీ స్వాగతించింది.

సీఎం కేసీఆర్ రాజకీయ యుద్ధంలో నిజం గెలిచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ కు బెయిల్ రావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అక్రమంగా బనాయించిన కేసు విచారణకు సహకరిస్తామన్న ఆయన… న్యాయవ్యవస్థపై బీజేపీకి సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. అక్రమ కేసులతో గొంతునొక్కాలని కేసీఆర్ సర్కారు ప్రయత్నిస్తున్నారని… కల్వకుంట్ల కుటుంబ అరాచకాలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. నిరంకుశ విధానాలతో నియంతృత్వ ధోరణితో రాష్త్రాన్ని పాలిస్తున్న కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కిషన్ రెడ్డి చెప్పారు. బండి సంజయ్‌ను జైలులోనే ఉంచి ఏప్రిల్ 8న జరిగే ప్రధాని కార్యక్రమాల్లో పాల్గొనకుండా తప్పుడు కేసులో ఇరికించి అడ్డుకోవాలని భావించిన ముఖ్యమంత్రికి కోర్టు తీర్పు చెంపపెట్టని బీజేపీ పేర్కొంది.

ఇలాంటి కుట్రలు పార్టీని, క్యాడర్‌ను భయపెట్టలేవన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. పార్టీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని ఆయన బహిరంగ లేఖలో కోరారు. “నన్ను అరెస్టు చేయడం, బీజేపీ కార్యకర్తలను వేధించడం బంతిని నేలకు కొట్టడం లాంటిది. మేము అదే శక్తితో తిరిగి పుంజుకుంటాం” అని బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల వేళ లేఖలో ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోనే కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అధికారాన్ని సంపాదించేందుకు బీజేపీ గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నందున కేసీఆర్ వేధింపులు ఎక్కువయ్యాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ అవినీతి, బంధుప్రీతి, మైనారిటీల బుజ్జగింపులకు పాల్పడుతూ పాలనను గాలికి వదిలేశారని బీజేపీ దుయ్యబడుతోంది. 2019లో రాష్ట్రంలోని నాలుగు పార్లమెంటరీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ, ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకోవాలని ఆశిస్తోంది. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.