Home Page SliderTelangana

తప్పు చేసింది టీఎస్పీఎస్సీ, కేసీఆర్… శిక్ష మాత్రం బీజేవైఎంకా?

చంచలగూడ జైలులో ఉన్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ తదితరులను ములాఖత్ ద్వారా కలుసుకొని పరామర్శించారు ఈటల రాజేందర్. తప్పు చేసింది కేసీఆర్ ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ అని… కానీ శిక్ష మాత్రం అనుభవిస్తోంది బీజేవైఎం యూత్ నాయకులని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనట్లే ఉద్యోగాల కల్పనలో కూడా విఫలమైందన్నారు ఈటల. 30 లక్షల మంది విద్యార్థుల కళ్లలో కేసీఆర్ మట్టి కొట్టారన్నారు. సంవత్సరాల తరబడి కళ్లుకాయలు కాసేటట్లు చదివి.. కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలకు ఖర్చుపెట్టి పరీక్ష రాస్తే పేపర్ లీక్ చేస్తారా అంటూ ఆక్షేపించారు. TSPSC… డబ్బులకు పేపర్లు అమ్ముకునేవాళ్లకు, బ్రోకర్లకు రాజ్యం అయిందన్నారు. గతంలో టీఎస్పీఎస్సీ అంటే ఒక గౌరవం నమ్మకం ఉండేదని… కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ మీద నమ్మకం పూర్తిగా పోయిందన్నారు. దోషులను శిక్షించి.. కటకటాలకు పంపించాల్సింది పోయి బీజేవైఎం నాయకులు భాను ప్రకాష్‌తో సహా 11 మందిని చంచలగూడ జైల్లో పెట్టారని ఈటల విమర్శించారు. 14 రోజులుగా జైల్లో మగ్గుతున్నారని… ములాఖాత్ కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీ కేసులకు భయపడదని.. కుట్రలకు వెరవరదన్నారు.

కేసీఆర్ ప్రభుత్వానికి ఈటల 4 డిమాండ్లు
* తక్షణమే దోషులకు శిక్ష వేయాలి.
* వెంటనే పరీక్షలు నిర్వహించి ఉద్యోగుల భర్తీ పూర్తి చేయాలి.
* సిట్‌లపై విశ్వాసం లేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
* టీఎస్పీఎస్సీ, దొంగలకు బ్రోకర్లకు నిలయంగా మారింది. బోర్డును రద్దు చేసి నిష్ణాతులైన వారిని నియమించాలి.