Home Page SliderNational

కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగమంటూ సుప్రీం కోర్టుకు 14 పార్టీలు

కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాన్ని ఏప్రిల్ 5న సుప్రీంకోర్టు విచారించనుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వంటి ఏజెన్సీలు బీజేపీ ప్రత్యర్థులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బీజేపీలో చేరిన తర్వాత నేతలపై కేసులు ఎత్తివేయడం లేదా తొక్కిపెట్టడం జరుగుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకొని… రెండు వారాల్లో కేసును విచారణ చేపట్టాలని నిర్ణయించారు.

దేశ వ్యాప్తంగా తొంభై ఐదు శాతం కేసులు ప్రతిపక్ష నేతలపై ఉన్నాయని… అరెస్టుకు ముందు మార్గదర్శకాలు, అరెస్టు తర్వాత మార్గదర్శకాలు చెప్పాలని సింఘ్వీ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతాదళ్-యునైటెడ్, భారత రాష్ట్ర సమితి, రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్ వాదీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలతోపాటుగా డీఎంకే పార్టీలు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశాయి. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ మనీష్ సిసోడియాను అరెస్టు తర్వాత, కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఆప్ తీవ్రంగా మండిపడుతోంది. ఐతే విచారణ సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయని బీజేపీ కౌంటర్ వర్షన్ విన్పించింది.