కేజ్రీవాల్ సీక్రెట్ మిషన్‌కు ఆదిలోనే హంసపాదు
2024 లోక్ సభ ఎన్నికలకు ముందు విపక్షాల థర్డ్ ఫ్రంట్ వ్యూహం బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. బీజేపీయేతర, కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల ఫోరమ్‌ను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ఆ భేటీకి ఒక్కరంటే ఒక్క ముఖ్యమంత్రి కూడా హాజరు కాలేదు. సీఎంలను మార్చి 18న ఢిల్లీకి కేజ్రీవాల్ ఆహ్వానించారు. కానీ ఈ సమావేశానికి ఎవరూ రాకపోవడంతో డిన్నర్ భేటీ రద్దయ్యింది. ఐతే తాజాగా ఆ విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఉమ్మడి కార్యాచరణతో కలిసి పనిచేయాలన్న అభిప్రాయాన్ని సీఎంలకు రాసిన లేఖలో కేజ్రీవాల్ వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎంలతో కేజ్రీవాల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి.. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వ్యవహారశైలిపై సమస్యలు ఎదుర్కొంటున్నారు. తనలాగే గవర్నర్లతో సమస్యలు ఎదుర్కొంటున్న ఏడుగురు ముఖ్యమంత్రులతో “ముఖ్యమంత్రుల ప్రగతిశీల బృందం” ఏర్పాటు చేయాలని భావించారు.

ఈ లేఖ ఫిబ్రవరి 5న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడుకు చెందిన MK స్టాలిన్, జార్ఖండ్‌కు చెందిన హేమంత్ సోరెన్, ఇతరులకు పంపించారు. ఆహ్వానితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఉన్నప్పటికీ ఆయనకు ఆరోగ్యం సరిగా లేదని పేర్కొంటూ సమావేశానికి హాజరుకానని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేయాలని కేసీఆర్ భావించినప్పటికీ.. ఆయా రాష్ట్రాల్లో స్పందన అంతంత మాత్రమే రావడంతో తానే ఆయా రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్, బీఆర్ఎస్‌గా మార్పు సమావేశానికి కేజ్రీవాల్ సైతం హాజరయ్యారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్నట్లు మమత బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, రెండోసారి బీజేపీ కూటమి నుంచి తప్పుకున్నాక… జాతీయ రాజకీయాల్లో కీలకభూమిక పోషిస్తారని అందరూ భావించారు. ఐతే తాను ప్రధానమంత్రి పదవి కోసం వెంపర్లాటడం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇదే విషయమై బీహార్ డిప్యూటీ తేజస్వీ యాదవ్ సైతం స్పష్టత ఇచ్చారు. నితీష్ కుమార్ ప్రధాని కావాలనుకోలేదని.. తాను ముఖ్యమంత్రిని కావాలనుకోవడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇద్దరం ఎవరి పనులను వారు సంతోషంగా చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. కూటమికి నాయకత్వం వహించాలన్న ఆలోచనకు తమకు ఎంత మాత్రం లేదని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి చెబుతోంది. ఐతే భావసారూప్యత గల పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధమని కూడా ఆ పార్టీ చెబుతోంది.