వివేకా హత్య కేసు విచారణ ఇంకెన్నాళ్లు: సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
సంచలనాలు, ట్విస్టులతో సాగుతున్న వివేక హత్య కేసు మరో కీలక మలుపు తీసుకుంది. కేసు విచారణకు సంబంధించి సీబీఐకి, సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారిని మార్చాల్సిన అంశంపై, సీబీఐ డైరెక్టర్‌ను కోర్టు స్పష్టత కోరింది. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య ఇంకెన్నాళ్లు దర్యాప్తు చేస్తారంటూ సీబీఐపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ నుంచి దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను తప్పించి మరొక అధికారిని నియమించాలని కేసులో కీలక నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై విచారించిన కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. కేసు దర్యాప్తు ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నించింది. కేసు విచారణ త్వరగా ముగించకుంటే… మరో అధికారిని ఎందుకు నియమించొద్దని తేల్చి చెప్పింది. కేసు విచారణకు సంబంధించి మరో అధికారిని నియమించే విషయమై అభిప్రాయం చెప్పాలని సీబీఐ డైరెక్టర్‌ను కోర్టు కోరింది. కేసు దర్యాప్తు వివరాలను సమర్పించాల్సిందిగా సీబీఐని కోర్టు ఆదేశించింది. ఐతే కేసు విచారణ సక్రమంగానే జరుగుతోందని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ జడ్జికి వివరించారు.


