Home Page SliderTelangana

శేఖర్జీకి మద్దతుగా సోషల్ మీడియాలో అభిమానుల పోస్టులు వైరల్

బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన బీజేపీ సీనియర్ నేత శేఖర్జీపై కొందరు విమర్శలు చేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శేఖర్జీని విమర్శిస్తారా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. మొదట్నుంచి సంఘం కోసం, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన శేఖర్జీ విషయంలో.. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని శేఖర్జీ అభిమానులు మండిపడుతున్నారు. సాధారణ రాజకీయ నేతల్లా.. ఆయనపై విమర్శలు చేస్తారా అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దాలని ఆయన గళం విప్పితే.. అనవసర రాద్ధాంతం చేయడం ఎంత వరకు సమంజసమని.. శేఖర్జీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు షేర్ చేస్తున్నారు. శేఖర్జీ ఎవరన్నది తెలుసుకోండంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అనేక విషయాలను ప్రస్తావిస్తున్నారు.

శేఖర్జీ మొదట్నుంచి సంఘం కోసం, పార్టీ కోసం పనిచేశారంటూ అభిమానులు కొన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. విద్యార్థిగా ఉన్ననాటి నుంచే వరంగల్‌లో నక్సలైట్లతో పోరాటాలు చేశారని గుర్తు చేస్తున్నారు. ABVP పూర్తి సమయ కార్యకర్తగా నెల్లూరులో రాజీలేని పోరాటాలు చేశారని అభిమానులు పోస్టుల్లో వివరిస్తున్నారు. ABVP రాష్ట్ర సంఘటనా కార్యదర్శిగా కార్పోరేట్ కాలేజీలపై ఉద్యమాలు చేయడమే కాక… ఎంసెట్ పేపర్ లీక్ అయినప్పుడు ప్రభుత్వ మెడలు వంచిన తెగువ శేఖర్జీదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ABVP క్షేత్ర సంఘటనా కార్యదర్శిగా… కటక్ కేంద్రంగా కార్యక్రమాలు చేపట్టిన శేఖర్జీ వెనకబడ్డ ప్రాంతాలైన బెంగాల్, ఒడిస్సాలలో కీలక బాధ్యతల్లో అద్భుతంగా రాణించారని వారు వివరిస్తున్నారు. సంఘ సూచనలతో ఈశాన్య రాష్ట్రాల్లో BJP క్షేత్రీయ సంఘటనా కార్యదర్శిగా పార్టీకి ఊపు తీసుకొచ్చారని గుర్తు చేస్తున్నారు శేఖర్జీ అభిమానులు. ఆయన ప్రయాణం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు షేర్ చేస్తున్నారు.

అంతేకాదు… సోషల్ మీడియా కేంద్రంగా శేఖర్జీ చేసిన ఆరోపణల్లో మర్మాన్ని గ్రహించాలంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం శేఖర్జీ చేస్తున్న విమర్శలను… పార్టీలో పెత్తనం చేస్తున్న వారి ఆరోపణలతో సమానంగా చూడటం మంచి పద్ధతి కాదంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సంఘ పెద్దలు ఆలోచించి… తగు నిర్ణయం తీసుకోవాలని అభిమానులు ఫేస్‌బుక్, ట్విట్టర్ వేదికగా వివరిస్తున్నారు. శేఖర్జీ ఆరోపణలు స్వార్థపూరితమని నమ్మితే… 3 దశాబ్దాలకు పైగా పూర్తి సమయాన్ని కార్యకర్తగా, ప్రచారక్‌గా పని చేసిన కార్యకర్త అంకితభావం ఏమవుతుందంటున్నారు అభిమానులు.

స్వార్థ రాజకీయంలో భాగంగా రాజకీయ వలస పక్షులతో శేఖర్జీపై నిరాధార ఆరోపణలు చేసి, తనకంటే చిన్న స్థాయి వారితో కమిటీ వేసి అవమానాలకు గురి చేసినప్పుడు తప్పును సరిదిద్దలేకపోయిందెవరంటూ అభిమానులు నిలదీస్తున్నారు. నిబద్ధత కలిగిన కార్యకర్తలను రాజకీయ వలసదారులు అవసరాల కోసం ప్రలోభాలకు గురిచేసి అధికారం కోసం ఏం చేసినా తప్పు కాదన్నపరిస్థితి సృష్టిస్తున్నవారి విషయంలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సోషల్ మీడియా వేదికగా శేఖర్జీ అభిమానులు గళం విప్పుతున్నారు. ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం సంస్థ కోసమని… సిద్ధాంతం కోసమని… నిబద్ధత కలిగిన కార్యకర్తల కోసమని… ఈ విషయాన్ని గ్రహించాలని శేఖర్జీ అభిమానులు సంఘ విజ్ఞప్తి చేస్తున్నారు.