బండి సంజయ్‌కు ఎంపీ అర్వింద్ ఝలక్.. కవితపై వ్యాఖ్యలను ఉపసంహరించుకో…
ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు సమర్థించబోనన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదని… అందరినీ సమన్వయం చేసే బాధ్యత మాత్రమేనన్నారు అర్వింద్. కవిత ఈడీ ఆఫీసులో ఉంటే, తెలంగాణ కేబినెట్ అంతా ఢిల్లీలో మకాం వేసిందన్నారు. ఇదే చిత్తశుద్ది ప్రజల అభివృద్ధిపై… ఉంటే రాష్ట్రం బాగుపడేదన్నారు. దర్యాప్తుకు కవిత సహకరించలేదని తెలిసిందన్నారు అర్వింద్. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఈడీ అధికారులు అడిగితే, కవిత ఏమో, తెల్వద్, గుర్తులేదు అని కవిత సమాధానం చెప్పినట్టు తెలిసిందన్నారు. చేతికి 20లక్షల గడియారం, కోట్ల రూపాయల నగలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు తెలుసునన్నారు. అవినీతిని అంతం చేయాలని మోడీ కంకణం కట్టుకున్నారని అర్వింద్ చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో మునిగితేలిందన్నారు. మీ వల్లే జెంటిల్మెన్ మాగుంట ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడిందన్నారు. పెద్ద సంస్థ అరబిందో సైతం చిక్కుల్లో పడిందన్నారు. కల్వకుంట్ల కుటుంబం రాజకీయాల్లో అంటరాని కుటుంబమన్నారు.


