ఢిల్లీ బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత
రేపు ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ విచారణ నోటీసుల నేపథ్యంలో… తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కొద్ది సేపటి క్రితం ఢిల్లీ బయల్దేరారు. ఈనెల 10న ఢిల్లీలో మహిళ బిల్లు కోసం దీక్షకు ముందుగా ఆమె ప్లాన్ చేసుకున్నారు. ఐతే ఇంతలోనే ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా కవితకు నోటీసులు అందాయి. అయితే 10 తారీఖును కీలక కార్యక్రమం పెట్టుకున్నందున ఈడీ ముందు హాజరు విషయమై.. న్యాయ నిపుణుల సలహా మేరకు నడుచుకుంటానని ఆమె ప్రకటనలో తెలిపారు. అయితే కవిత… ధర్నాకు ఒక రోజు ముందే ఢిల్లీ వెళ్లడం… ఆమె విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.
ఈడీ నోటీసులపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ తలవంచదన్నారు. జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి మార్చి 10న మా ధర్నాకు ముందు, మార్చి 9న ED విచారణకు పిలిచిందన్నారు. తాను విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని చెప్పిన కవిత, ఈడీ విచారణకు హాజరుపై న్యాయపరమైన సలహా తీసుకుంటానన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు.

