Home Page SliderNational

అమెరికా, యూరప్ జోక్యం కావాలా? రాహుల్ గాంధీపై మండిపడ్డ బీజేపీ

భారతదేశ ప్రజాస్వామ్యం విఫలమైందంటూ లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యపై బీజేపీ మండిపడింది. రాహుల్ గాంధీ విదేశీ జోక్యాన్ని కోరుతూ, విదేశీ గడ్డపై దేశాన్ని అవమానిస్తున్నారంటూ బీజేపీ ఆరోపించింది. రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో ఇండియాలో ప్రజాస్వామ్యం, రాజకీయాలు, పార్లమెంటు, రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య రక్షకులైన యూరప్, అమెరికాలు భారతదేశంలో ప్రజాస్వామ్యం విఫలమవుతుంటే పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ వివరణ ఇవ్వాల్సి ఉందని బీజేపీ పేర్కొంది.


“ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు యూరప్, అమెరికా జోక్యం చేసుకోవాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు? అది ఎవరి ప్రభుత్వమైనా సరే, మన అంతర్గత వ్యవహారాల్లో విదేశాలు జోక్యం చేసుకోరాదని మొదట్నుంచి స్ఫష్టం చేస్తున్నాం. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఏ విదేశీ దేశం జోక్యం చేసుకోకూడదు” అని ప్రసాద్ అన్నారు. మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ అధ్యక్షుడు స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడని భావిస్తే… ఇండియాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి అమెరికా, యూరప్‌లు జోక్యం చేసుకోవాలని రాహుల్ గాంధీ చేసిన బాధ్యతారాహిత్యమైన, సిగ్గుమాలిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? మీరు అలా చేయకపోతే, వాటిని తిరస్కరించాలని బీజేపీ స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలపై మీ వైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ సోనియాను కోరింది.