హనుమంతుడి ముందు కుప్పిగంతులా?
మధ్యప్రదేశ్లోని రత్లాంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బాడీబిల్డింగ్ పోటీ వేదిక వద్ద… కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం గంగా జలాన్ని చల్లారు. మహిళా బాడీబిల్డర్లు బ్రహ్మచారి అయిన హనుమంతుడిని అవమానించారని ఆరోపించారు. 13వ మహిళల జూనియర్ బాడీబిల్డింగ్ పోటీలు మార్చి 4 మరియు 5 తేదీల్లో జరిగాయి. ఇందులో మహిళా బాడీబిల్డర్లు హనుమాన్ చిత్రం ముందు పోజులు ఇచ్చారు. హిందువుల పరమ పవిత్రమైన హనుమంతుడి ముందు మహిళలతో ప్రదర్శన చేయడం విడ్డూరమంటూ స్థానిక కాంగ్రెస్ నాయకులు వేదికపై గంగా జలంతో శుద్ధి చేసి, ‘హనుమాన్ చాలీసా’ పఠించారు.

ఈ కార్యక్రమం ఆర్గనైజింగ్ కమిటీలో నగర బీజేపీ మేయర్ ప్రహ్లాద్ పటేల్, ఎమ్మెల్యే చైతన్య కశ్యప్ ఉన్నారు. సోషల్ మీడియాలో కనిపించిన ఈ ఈవెంట్ వీడియో, మహిళా బాడీబిల్డర్లు పోజులివ్వడాన్ని చూపించింది. మాజీ మేయర్, కాంగ్రెస్ నాయకుడు పరాస్ సక్లేచా పటేల్ ఈవెంట్ నిర్వహణపై మండిపడ్డాడు. ఎమ్మెల్యే కశ్యప్ “అసభ్యతను” ప్రదర్శించారని ఆరోపించారు. జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మయాంక్ జాట్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం చేసిన వారిని హనుమంతుడు శిక్షిస్తాడన్నారు. ఐతే మహిళలు క్రీడల్లో రాణించడం కాంగ్రెస్కు ఇష్టం లేదని రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి హితేష్ బాజ్పాయ్ దుయ్యబట్టారు. కొంతమంది ఈవెంట్ నిర్వాహకులు కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు మెమోరాండం సమర్పించారు. కాంగ్రెస్ నేతలు మహిళలు రెజ్లింగ్, జిమ్నాస్టిక్స్ లేదా స్విమ్మింగ్లో పాల్గొనడాన్ని చూడలేరు, ఎందుకంటే వారిలోని దెయ్యం మేల్కొంటుందని… వారు ఆట స్థలంలో మహిళలను మురికి కళ్లతో చూస్తారని… వారికి సిగ్గు లేదని బాజ్పాయ్ మండిపడ్డారు.

ఆదివారం ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం హిందువులను, హనుమంతుడిని అగౌరవపరిచిందన్నారు మాజీ సీఎం కమల్ నాథ్ సలహాదారు పీయూష్ బాబెలే. బీజేపీ నేతల చేష్టలకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అశ్లీలతకు మద్దతు ఇస్తున్నందుకు టెలివిజన్ చర్చలలో తామ బీజేపీ నేత బాజ్పాయ్ను బహిష్కరిస్తున్నామని బాబెలే చెప్పారు.