అభ్యర్థుల ఎంపికపై వైసీపీ, టీడీపీ ఫోకస్
• ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థుల ఖరారు
• ఫోకస్ పెట్టిన వైసీపీ, టీడీపీ అధినేతలు
• సిట్టింగ్ ఎమ్మెల్యేల గ్రాఫ్ ఆధారంగా టికెట్లు
• పర్ఫామెన్స్ ఆధారంగానే టికెట్లన్న జగన్
• జనసేనతో సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు
ఏపీలో ఇంకా ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు అప్పుడే అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై దృష్టి పెట్టాయి. తాజాగా తెనాలిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎన్నికల సమరాన్ని తలపించడంతో ముందస్తు ఎన్నికల భావనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పీడును మరింత పెంచి అవసరమైన కార్యాచరణను ప్రారంభించింది. దాదాపు ప్రధాన పార్టీలు ప్రతి నియోజకవర్గంపై ఫోకస్ పెడుతూ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి జనసేనకు దాదాపుగా పోత్తు ఖరారు కావటంతో అభ్యర్థుల ఎంపిక సీట్ల కేటాయింపులులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలుగుదేశం పార్టీ అధిష్టానం జాగ్రత్తలు చేపట్టింది.

సర్దుబాట్లు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ప్రణాళిక బద్ధంగా తన వ్యూహాలను అమలు చేసే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. ఇప్పటికే జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కేటాయింపులకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. అధికార పక్షాన్ని ఢీకొట్టాలంటే ఈ ఎన్నికల్లో పొత్తులు ఉంటేనే సాధ్యమన్న భావనలో రెండు పార్టీల అధినేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలకు ఆమోదయోగ్యంగా సీట్ల కేటాయింపు ఉండేలా అత్యంత రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారు. అలానే వైసీపీ అధినేత జగన్ కూడా గడపగడపకు కార్యక్రమంలో మంచి మార్కులు తెచ్చుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ రానున్న ఎన్నికల్లో టికెట్లు కేటాయించే విధంగా నివేదికలు తెప్పించుకుంటున్నారు. నియోజకవర్గంలో పూర్తిపట్టు ఉండి ప్రజల విశ్వాసం ఉన్న ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఆయన ఉన్నారు. ప్రజల్లో ఏమాత్రం గ్రాఫ్ లేని ఎమ్మెల్యేలను ఈసారి ఎన్నికల్లో పక్కనపెట్టి కొత్తవారిని ఎంపిక చేసే పనిలో పడ్డారు.

175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ఆమేరకు తన ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తూ ఆ ప్రకారంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తూ రానున్న ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో కూడా వారికి సీట్లు కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైన చోట్ల నియోజకవర్గ ఇన్చార్జిలను మార్చుతూ, స్పష్టమైన వైఖరి నేతలకు అర్థమయ్యేలా జగన్ వ్యవహరిస్తున్నారు. మే నెల నాటికి వచ్చిన నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇరు పార్టీలు ముందుకు సాగుతున్నాయి.