దేశానికి ఆదర్శనీయంగా ఏపీలోని ఆర్బీకేలు
ఆర్బీకేలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని భావించడంతో పాటు, ఇతర దేశాల్లో కూడా అమలు చేయాలని ఆయా ప్రతినిధులు సందర్శించి వెళుతున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్ పంటల భీమా ద్వారా 44.48 లక్షల రైతన్నలకు రూ. 6,685 కోట్ల బీమా సొమ్ము అందజేశామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇదే పథకాన్ని కేవలం 30 లక్షల రైతులకు మాత్రమే వర్తింప చేశారని కేవలం రూ. 3,411 కోట్లు మాత్రమే పంటల బీమా కింద చెల్లించారని విమర్శించారు. రైతులు ఈ విషయాన్ని ఆలోచించాలని సీఎం జగన్ కోరారు. కోతలు ఎలా పెట్టాలో కచ్ఛితంగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు మాత్రమేనని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో రైతన్నలకు రెండింతల సాయం అందిందన్నారు. ఈ క్రాప్ ద్వారా నోటిఫై చేసిన ప్రతి పంటలకు ఆటోమేటిక్ గా ఇన్సూరెస్ కవరేజి వస్తుందని వివరించారు. సొంత గ్రామంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ఆర్బీకేల ద్వారా అందిస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు. తుఫాన్లు, వరదలతో నష్ట పోయిన రైతులకు లంచాలు, వివక్ష లేకుండా నష్ట పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి అందిస్తున్నట్లు వివరించారు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఉచిత కరెంట అంటే వైఎస్సార్ పేరు గుర్తుకు వస్తుందని ఈ నాలుగేళ్లలో ఉచిత విద్యుత్ కోసం చేసిన ఖర్చు రూ. 27,800 కోట్లుగా ఉందని వివరించారు. రైతన్నలకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం రూ. 1,500 కోట్లు ఖర్చు చేసి ఫీడర్ల సామర్థ్యం పెంచామని సీఎం జగన్ చెప్పారు.