ప్రభుత్వ ఉద్యోగులంటే జగన్ సర్కారుకు చులకన…
జగన్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులను చులకనగా చూస్తోందన్నారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు. సహనాన్ని చేతకానితనంగా భావిస్తున్నారని… ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదన్నారు. సీఎం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరలేదన్నారు. ఆర్థికపరమైన అంశాలన్నీ పరిష్కరించాలని సీఎంను కోరిన… సమస్యలపై మంత్రుల బృందం చర్చలన్నీ చాయ్-బిస్కెట్ చర్చలేనని విమర్శించారు. ఆలస్యమైనా మాకు మేలు చేస్తారని ఇన్నాళ్లూ చూశామన్న బొప్పరాజు… ఇక మాకేమీ చేయరని తెలిసిందన్నారు. అందుకే ఉద్యమంలోకి దిగుతున్నామన్నారు. ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వమే కారణమన్నారు. మార్చి 9, 10న నల్ల బ్యాడ్జీలతో నిరసన నిర్వహిస్తామని… మార్చి 13, 14న కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తామన్నారు. మధ్యాహ్న భోజన విరామ వేళ ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. 15, 17, 20న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామన్నారు. మార్చి 21 నుంచి వర్క్ టు రూల్, సెల్ఫోన్ డౌన్, మార్చి 24న హెచ్వోడీల వద్ద ధర్నాలు చేస్తామన్నారు. మార్చి 27న కరోనా మృతుల కుటుంబాలను కలుస్తామన్నారు. ఏప్రిల్ 1న ఉద్యోగులకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఏప్రిల్ 3న ప్రతి జిల్లాలో చలో స్పందన, అధికారులకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. ఏప్రిల్ 5న రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. డిమాండ్లు పరిష్కరించకుంటే రెండోదశ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులపై ప్రజలు కూడా సానుభూతి చూపిస్తున్నారని… 20వ తేదీ దాటీనా జీతాలు వేయడం లేదన్నారు. జీతాలు సరిగా ఇవ్వక ప్రభుత్వ ఉద్యోగులు చులకనగా తయారయ్యారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజల్లో భాగమన్న బొప్పరాజు… సహకరించాలని ప్రజాసంఘాలు, కార్మికసంఘాలను ఆహ్వానిస్తున్నామన్నారు.


