ఈవెంట్ మేనేజ్మెంట్‌లో ఆప్ పండిపోయిందంటూ బీజేపీ ఎదురుదాడి
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ ఎదుట హాజరు కావడానికి గంటల ముందు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేసిన ప్రసంగంపై భారతీయ జనతా పార్టీ విరుచుకుపడింది. సిసోడియా ఈరోజు ఉదయం 10 గంటలకు తన ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారుల రోడ్‌షోకి నాయకత్వం వహించడంపై మండిపడింది. ప్లకార్డులు, నినాదాల మధ్య తన కారు సన్‌రూఫ్‌పై నిలబడి మద్దతుదారుల వైపు చేతులు ఊపడం, సిసోడియా ప్రసంగం, ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించడమంతా ఒక ప్రణాళిక ప్రకారం చేశారంటూ దుయ్యబట్టింది.

అవినీతిని దాచడంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ సహాయం చేయదన్నారు బీజేపీ సీనియర్ నేత సంబిత్ పాత్ర. “అవినీతిని ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మార్చడం అవినీతిని దాచడానికి వారికి సహాయం చేయదు. మద్యం పాలసీ స్కామ్‌పై ఆప్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు” అని పాత్ర అన్నారు. “ఒక విషయం స్పష్టంగా ఉంది, వారు నిజాన్ని దాచడంలో బిజీగా ఉన్నారు. వారు సిబిఐకి సమాధానం ఇవ్వాలి, ఈవెంట్ మేనేజ్‌మెంట్ అవసరం లేదు” అని విమర్శించారు.
పంజాబ్‌లోని ప్రభుత్వ కార్యాలయాల నుండి మహాత్మా గాంధీ ఫోటోలను పార్టీ తొలగించినప్పుడు, సిసోడియా రాజ్‌ఘాట్‌ను ఎందుకు సందర్శించారని బీజేపీ నేత రమేష్ బిధూరి ప్రశ్నించారు. దొంగతనం చేసి మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తున్నారని ధ్వజమెత్తారు. సిసోడియా అవినీతికి పాల్పడ్డారని జైలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. దేశ రాజధానిలో కొత్త మద్యం విక్రయ విధానాన్ని తీసుకురావడంలో సిసోడియా, ఇతరులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతేడాది సీబీఐ విచారణకు ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వం పాత మద్యం పాలసీకి శ్రీకారం చుట్టి కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని లెఫ్టినెంట్ గవర్నర్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

