తెలంగాణ వచ్చింది ఇందుకేనా? కేసీఆర్‌కు ఈటల సూటి ప్రశ్న
24 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మద్యం మీద ఏడాదికి 30 వేల కోట్ల ఆదాయమొస్తుంటే… 4 కోట్లున్న తెలంగాణలో 45 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ పాలనలో దుబాయ్ బతుకులు పోకపోగా… అక్కడ్నుంచి శవాలు వస్తున్నాయన్నారు. తెలంగాణ యువత గల్ఫ్ జైళ్లో మగ్గిపోతున్నారన్నారు. వ్యవసాయాన్ని నియంత్రిస్తానని చెప్పిన కేసీఆర్, ఏ పంట వేసుకోవాలో కూడా చెప్పలేదని… ఇప్పుడు పంటకు గిట్టుబాటు ధర రాక రైతు విలవిలలాడుతున్నాడన్నారు. రైతు వేదికలు.. రాత్రి పూట మందు పార్టీలకు అడ్డాలయ్యాయని… కోతులకు నెలవయ్యాయన్నారు ఈటల. లీటర్ పెట్రోల్‌పై కేంద్రం పన్ను రూ. 19.55 పైసలైతే.. రాష్ట్ర పన్ను 37 రూపాయలన్నారు ఈటల. ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డిలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో ఈటల స్థానిక నేత, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లా మట్టిబిడ్డలు, వ్యవసాయాన్ని నమ్ముకున్న భూమి పుత్రులన్నారు ఈటల. ఇక్కడ పుట్టిన వారు అయితే వ్యవసాయం చేస్తారు…. లేదంటే దుబాయి వెళ్ళి కష్టపడి పనిచేస్తారన్నారు. దుబాయ్, బొగ్గుబాయి బతుకులు పోవాలంటే తెలంగాణ రావాలి.. ఇది కేసీఆర్ ఇచ్చిన నినాదమని… ఏం చేశాడని వలసలు ఆగిపోతాయన్నారు ఈటల. నిజామాబాద్ జిల్లాలో వలసలు వాపస్ వచ్చాయా అని ప్రశ్నించారు. కన్న గడ్డను, కనిపించిన అమ్మానాన్నను, కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను వదిలిపెట్టి రెండేళ్లు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. దుబాయ్ వెళ్లే వారికి ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయాలన్నారు. నకిలీ ఏజంట్లను నియంత్రించాలన్న ఈటల… 500 కోట్లతో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ పెడితే… డబ్బులు ఇవ్వడానికి కేసీఆర్‌కి చేతులు రాలేదన్నారు

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి ఖర్చు కాకుండా.. మధ్యవర్తులు లేకుండా.. ఉద్యోగాలు, పనుల కోసం ప్రభుత్వమే ఒక ఏజెన్సీని పెట్టి దుబాయ్ పంపించే ఏర్పాటు చేస్తుందన్నారు ఈటల. రెండేళ్లకోసారి కాదు.. ఆర్నెలల కోసారి వచ్చే విధంగా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు. బొంబాయి, సోలాపూర్, భీమండిలో ఎలా బతుకుతారో మీ అందరికీ తెలుసు. తెలంగాణ వచ్చాక అవి మారాయా అని ఈటల ప్రశ్నించారు?