Home Page SliderNational

ఇద్దరు మహిళా అధికారులకు కర్నాటక సర్కారు పనిష్మెంట్

ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడంతో ఇద్దరు ఉన్నతాధికారులపై కర్నాటక సర్కారు వేటు వేసింది. ఎలాంటి పదవులు ఇవ్వకుండా వారిని శాఖల నుంచి తొలగించారు. రూప ముగ్దల్ ఐపీఎస్, రోహిణి సింధూరి ఐఏఎస్ ఇద్దరు తీవ్ర విమర్శలు చేసుకోవడంతో దేశ వ్యాప్తంగా కలకలం రేగింది. ఐతే తాజా మార్పుల్లో రూప భర్త మునీష్ ముగ్దల్‌ను పబ్లిసిటీ సెల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఇద్దరు అధికారులు ప్రవర్తన అసలేం బాలేదంటూ హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఇప్పటికే విరుచుకుపడ్డారు. రోహిణి సింధూరి ప్రైవేట్ ఫోటోలను రూప ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో వివాదం చినికి చినికి గాలివానలా మారింది.

తన ఫోటోలను పురుష ఐఏఎస్‌లకు రోహిణి పంపించారని అందుకే తాను ఇలా చేశానంటూ రూప విమర్శలు గుప్పించింది. 2021-22 మధ్య ముగ్గురు అధికారులకు రోహిణి తన పోటోలను పంపించారని రూప ఆరోపించింది. ఇలా పురుష ఐఏఎస్‌లకు పంపించడం ఏంటని రూప ప్రశ్నించారు. తనది ప్రైవేట్ లైఫ్ కాదన్నారు. ఇప్పుడు తనకు ఆ ఫోటోలు లభించాయని అందుకే తాను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశానంది. ముందే తెలిసి ఉంటే… అప్పుడే పోస్ట్ చేసేదాన్నన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టబోనన్నారు. ఇది నిబంధనల ఉల్లంఘననన్నారు. మొత్తం వ్యవహారంపై చీఫ్ సెక్రటరీ వందిత శర్మతో ఫిర్యాదు చేశానన్నారు.

ఐతే మొత్తం విమర్శలపై రోహిణి తీవ్రంగా స్పందించారు. రూప తనకు బాస్ కాదన్నారు. సీనియర్ కూడా కాదన్నారు. ఆమె ప్రభుత్వంలో భాగం కాదన్నారు. పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లపై వృత్తిపరమైన నిర్ణయాలను ప్రశ్నించడానికి ఆమె ఎవరన్నారు. ఇలా వ్యవహరించడం నిబంధనల ఉల్లంఘనేనన్నారు. రూపపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని రోహిణి హెచ్చరించారు. కర్నాటక హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా డి రూప, హిందూ మత సంస్థలు, ధర్మాదాయ శాఖ కమిషనర్‌గా సింధూరిని ఉన్న ఇద్దరిని ప్రభుత్వం తొలగించింది.