Home Page SliderInternationalNational

పాకిస్తాన్‌లోనే ఆ దేశాన్ని వేలెత్తి చూపించిన జావెద్ అక్తర్

ప్రముఖ రచయిత, కవి జావేద్ అక్తర్ 26/11 ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ, ఆ దేశం వెళ్లి… అక్కడే విమర్శలు గుప్పించారు. ముంబై దాడుల ఘటనలు భారతీయుల హృదయాల్లో గాయాలు రేపాయంటూ… అక్తర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జ్ఞాపకార్థం లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు జావేద్ అక్తర్ గత వారం పాకిస్థాన్‌ వెళ్లారు. పరస్పర చర్చలు జరపుకోవడం ద్వారా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు కారణం ఇండియా అంటూ పాకిస్తాన్ నిందించడం కరెక్ట్ కాదన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి చేసిన కామెంట్స్‌కు అక్తర్ ఘాటు సమాధానం చెప్పారు. “మీరు చాలాసార్లు పాకిస్తాన్‌ను సందర్శించారు. తిరిగి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ ప్రజలు మంచి వ్యక్తులు అని చెబుతారా, వారు మాపై బాంబులు వేయడమే కాదు, దండల వేస్తూ… ప్రేమతో కూడా పలకరిస్తారు?” అంటూ ప్రశ్నించారు. అందుకు జావేద్ అక్తర్ ఇలా సమాధానమిచ్చాడు: “మనం ఒకరినొకరు నిందించుకోనక్కర్లేదు. దాని వల్ల పరిష్కారం లభించదు. ఇరుదేశాల మధ్య వాతావరణం ఉద్రిక్తంగా ఉంది, దానిని చల్లార్చాలి. మేము ముంబైకి చెందిన వ్యక్తులం, మా నగరంపై దాడిని చూశాం. దాడి చేసినవారు నార్వే లేదా ఈజిప్ట్ నుంచి రాలేదు. వారు ఇప్పటికీ మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కాబట్టి హిందుస్తానీ హృదయంలో కోపం ఉందని… మీరెలా కంప్లైంట్ చేస్తారన్నారు.”

పాక్ దిగ్గజాలకు భారతదేశం ఆతిథ్యమిచ్చిన రీతిలో భారతీయ కళాకారులకు పాకిస్తాన్‌లో స్వాగతం లభించలేదని జావెద్ అక్తర్ దెప్పిపొడిచారు. “ఫైజ్ సాహబ్ సందర్శించినప్పుడు, చాలా ముఖ్యమైన అతిథిగా గౌరవం లభించిందన్నారు అక్తర్. ఆయన కార్యక్రమం దేశమంతటా ప్రసారం అయ్యిందన్నారు. నుస్రత్ ఫతే అలీ ఖాన్, మెహదీ హసన్‌ల ఫంక్షన్‌లను పెద్ద ఎత్తున నిర్వహించామన్నారు. పాకిస్థాన్‌లో లతా మంగేష్కర్ కోసం ఎప్పుడైనా, ఒక ఫంక్షనైనా నిర్వహించారా?” అంటూ ప్రశ్నించగా… కార్యక్రమానికి వచ్చినవారందరూ చప్పట్లతో స్వాగతించారు.

పాకిస్తాన్ లో జావేద్ అక్తర్ వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు దీనిని పాకిస్తాన్‌లో అక్తర్ స్టైల్ “సర్జికల్ స్ట్రైక్స్” అంటూ కితాబిస్తున్నారు. “నేను జావేద్ సాబ్ కవిత్వం వింటున్నప్పుడు, సరస్వతీ దేవి ద్వారా ఎంత ఆశీర్వదించబడ్డాడో నేను ఆశ్చర్యపోతుండేదాన్ని. కానీ దేవుడు వారిని ఆశీర్వదించడానికి వ్యక్తిలో ఏదో స్వచ్ఛత ఉండాలి. జై హింద్ @ జావేద్ అక్తర్ జాదూ సాబ్. మీరు వారిని, వారి దేశంలో ఓడించారంటూ కంగనా ట్విట్టర్లో రాసుకొచ్చారు.