నక్సలైట్లు ప్రగతి భవన్ పేల్చితే ఏంటి? రేవంత్ వ్యాఖ్యలపై రగడ
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల రచ్చ కొనసాగుతోంది. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మూడో రోజు సీఎం కార్యాలయం ప్రగతి భవన్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున 10 ఎకరాల్లో, రూ. 2 వేల కోట్లు పెట్టి.. 150 గదులతో ప్రగతి భవన్‌ను, సీఎం కేసీఆర్ నిర్మించుకున్నారన్నారు. సామాన్యులకు ప్రవేశం లేని, ఆంధ్ర పెట్టిబడిదారులకు ఎర్రతివాచీ వేసి స్వాగతం పలుకుతున్నారని రేవంత్ ఆరోపించారు. అలాంటి ప్రగతి భవన్ ఉంటే ఏంటి? ఎవరైనా నక్సలైటు బాంబులు పెట్టి పేల్చేస్తే ఏంటన్నారు.

రేవంత్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడ్డారు. ఒక పార్టీ అధ్యక్షుడు అనాల్సిన మాటలేనా ఇవి అంటూ ప్రశ్నించారు. పేల్చేయడం, కూల్చేయడం ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారో గ్రహించాలన్నారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి. అసాంఘిక సంఘ విద్రోహులు మాట్లాడే భాష అలా ఉంటుందన్నారు. మావోయిస్టులను పేల్చేయమని పిలుపునివ్వడమేంటని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం ఛత్తీస్ గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని… అక్కడ కూడా మావోయిస్టులు ఉన్నారని… సీఎం నివాసాన్ని పేల్చేయమని పరోక్షంగా చెబుతున్నారా అంటూ మండిపడ్డారు.

ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ ముఖ్యులు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. జనారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి నేతలు… సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైళ్లో పెట్టాలన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఐతే ప్రగతి భవన్ కూల్చేయాలన్న వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేదేలేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతల కేసులకు భయపడేదిలేదన్నారు. అమరవీరులకు అనుమతిఐ లేని ప్రగతి భవన్ ఎందుకని ప్రశ్నించారు రేవంత్. కేసీఆర్ భూతం లాంటి వారిని సీసాలో పెట్టి బంధించాలని లేకుంటే తట్టుకేలేమన్నారు.

