Andhra PradeshHome Page Slider

‘మా నమ్మకం నువ్వే జగనన్న’ 175 నియోజకవర్గాల్లో స్టిక్కర్లు

• 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు
• బస్సు యాత్ర – పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి సీఎం జగన్
• బడ్జెట్ సమావేశాల అనంతరం రూట్ మ్యాప్ ఖరారు

ఎన్నికలవేళ జగన్ సరికొత్త వ్యూహం అమలు చేయాలని భావిస్తున్నారు. ఏపీలో 2019 ఎన్నికల ముందు పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలను నేరుగా కలుసుకున్న వైయస్ జగన్ ఆ ఎన్నికలలో వారి ఆశీస్సులతో రాష్ట్రంలో 151 స్థానాలను సొంతం చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఇటు ప్రభుత్వ పరంగా అటు పాలనాపరంగా తనదైన ముద్ర వేసుకుంటున్న జగన్, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటివరకు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమీక్షలు సమావేశాలకు ఎక్కువ సమయం కేటాయించిన జగన్ ఇక ప్రజల్లోకి నేరుగా వెళ్లాలని యోచిస్తున్నారు. అందుకోసం పల్లె నిద్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత బస్సు యాత్ర నిర్వహించడంతోపాటు పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టాలని యోచిస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత రూట్ మ్యాప్ కూడా ఖరారు చేయనున్నారు. వీటి కంటే ముందుగా మరో వినూత్న కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 11 నుండి సంక్షేమ ఫలాలు అందుతున్న ప్రతి ఇంటికి ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ అనే నినాదంతో స్టిక్కర్లను అంటించనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్ది రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు వివిధ కార్యక్రమాల పేరుతో నిరంతరం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్ తో యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. మరోవైపు జనసేన అధినేత కూడా త్వరలో వారాహి యాత్ర చేపట్టాలని నియోచిస్తున్నారు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటుంది.

అయితే ఇప్పటికే నవరత్నాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు అవసరమైన సంక్షేమ ఫలాలను అందిస్తున్న సీఎం జగన్ ఇప్పటివరకు ప్రజలకు అందిన పథకాల గురించి వివరించేందుకు పల్లె నిద్ర బస్సు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో పర్యటిస్తూ ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో పల్లెనిద్ర చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో పల్లె నిద్ర చేసే సందర్భంలో రచ్చబండ కార్యక్రమాలను కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు. గతంలోనే రచ్చబండ నిర్వహించాలని జగన్ నిర్ణయం తీసుకున్నప్పటికీ కరోనా తదితర కారణాల వల్ల రచ్చబండ కార్యక్రమంలో కొంత జాప్యం జరిగింది. అయితే మార్చి 2,3 తేదీల్లో ప్రారంభం కారణంగా బడ్జెట్ సమావేశాల తర్వాత జగన్ పల్లె నిద్రకు వెళ్ళనున్నారు. పల్లె నిద్ర బస్సు యాత్ర కార్యక్రమానికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్య నాయకులతో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులతో కూడా ఈ కార్యక్రమం పై చర్చించినట్లు తెలుస్తుంది.

అయితే అసెంబ్లీ సమావేశాల తర్వాత బస్సు యాత్ర పల్లెనిద్ర కార్యక్రమాలకు సంబంధించి పూర్తిస్థాయిలో రూట్ మ్యాప్ ఖరారు కానుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహాలతో ఎప్పటికప్పుడు ప్రత్యర్ధులపై ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దూకుడు పెంచుతున్నారు. 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో విజయం సొంతం చేసుకున్న జగన్ వచ్చే ఎన్నికల్లో కూడా మరో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ప్రతి ఎమ్మెల్యేను గడపగడపకు వెళ్ళమని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై జగన్ వర్క్ షాప్ నిర్వహించి ఎమ్మెల్యేల పనితీరును వివరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తూ నిరంతరం ఎమ్మెల్యేలను ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వారితోపాటు జగన్ కూడా ప్రజల్లోకి వెళ్లాలని అందుకోసమే ప్రత్యేకంగా బస్సు యాత్ర పల్లెనిద్ర కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు.