Andhra PradeshHome Page Slider

కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు

• పార్టీ బలోపేతం కోసం ప్రతి అంశంపై ఆచితూచి అడుగులు
• నియోజకవర్గాల్లో ప్రజాబలం లేని ఇన్చార్జిల మార్పు
• తాజాగా నాలుగు నియోజకవర్గాల ఇన్చార్జిలకు ఉద్వాసన
• త్వరలో అన్ని నియోజకవర్గాలకు ప్రత్యేక పరిశీలకులు, కోఆర్డినేటర్ల నియామకం
• నేతల పనితీరుపై సమగ్ర దృష్టి

ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత రావటం దానిని అందిపుచ్చుకోవడానికి రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అంతేకాకుండా తన రాజకీయ చాణిక్యానికి పదును పెడుతూ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు వడివడిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా కొన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ నేతల పనితీరు సక్రమంగా లేని పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని విజయం దిశగా నడిపించేందుకు కీలక నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూనే ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నారు.

కడప, అనంతపురం, చిత్తూరు, విశాఖ, గుంటూరు తూర్పుగోదావరి ,కృష్ణాజిల్లాలో ప్రత్యేక పరిశీలకులను నియమించే దిశగా చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలకు ప్రత్యేక పరిశీలకులను ఆయన నియమించారు. ఇప్పుడు అదే బాటలో కొన్ని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మరి కొంతమంది పరిశీలకులను నియమించేందుకు ఏర్పాటు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ఆయా నియోజకవర్గాల్లో కేవలం ద్వితీయశ్రేణి నేతలే పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులతో పాటు పార్టీ పరంగా నిత్య పర్యవేక్షణ సాగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఈ అంశంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాలకు పరిశీల కులతో పాటు, కోఆర్డినేటర్లను కూడా నియామకం చేయబోతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

ప్రతి నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించడమే కాకుండా తన సొంత వర్గంతో అక్కడ ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకుంటూ దానికి సంబంధించిన నివేదికలను చంద్రబాబు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. ఇదే సమయంలో గ్రూపు విభేదాలకు స్వస్తి పెట్టేందుకు ముమ్మరమైన చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా యువతరాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా 4 నియోజకవర్గాల ఇన్చార్జిలకు ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్త వారినిని మించి పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. నేతలు ఎంతటి వారైనా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని భావిస్తున్న చంద్రబాబు తాజాగా ఇన్చార్జిలో మార్పునకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు రాష్ట్రంలోని మరికొన్ని నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మార్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే దాదాపుగా పదికి పైగా నియోజకవర్గ ఇన్చార్జిలకు ఆ బాధ్యతల నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వబోతున్నట్లు స్పష్టమైన సమాచారం అందుతుంది.