5న నాగార్జున యూనివర్శిటీ లా పూర్వవిద్యార్థుల సమ్మేళనం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఫిబ్రవరి 5వ తేదీ ఆదివారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని డాక్టర్ హెచ్.హెచ్.డైక్ మ్యాన్ ఆడిటోరియంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు గురువులకు సన్మానాలు చేసి గౌరవిస్తారు. హైకోర్టు జడ్జిలు, వివిధ రాష్ట్రాల్లో న్యాయమూర్తులుగా వివిధ హోదాలలో పనిచేస్తున్న పూర్వ విద్యార్థులను కూడా సత్కరిస్తారు. విశ్వవిద్యాలయం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు లా డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చేసిన పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనానికి హాజరవుతున్నారు. ఇక్కడ లా చేసి, ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పని చేస్తున్న అందరికీ నిర్వాహకులు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ నుంచి ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన అనేక మంది ప్రముఖులు ఇక్కడ లా చేశారు. ఇక్కడి పూర్వ విద్యార్థులు వివిధ రాష్ట్రాలలో జడ్జిలుగా, దేశవ్యాప్తంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ గా, లీగల్ ఆఫీసర్స్ గా, న్యాయ సలహాదారులుగా, వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ చూపిస్తున్నారు.

