గవర్నర్ విషయంలో హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్ సర్కారు
తెలంగాణ సర్కార్ వర్సెస్ గవర్నర్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంపై తెలంగాణ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. బడ్జెట్‌కు ఎందుకు ఆమోదం తెలపకపోవడంపై విచారణకు సీజే ధర్మాసనం అంగీకరించింది. ఐతే ఈ వ్యవహారంలో గవర్నర్‌కు హైకోర్టు నోటీసులు ఇవ్వగలదా అన్నది ఆలోచించుకోవాలని హైకోర్టు అడ్వొకేట్ జనరల్‌ను అడిగింది. కోర్టులు మితిమీరి జోక్యం చేసుకున్నాయని ఆ తర్వాత మీరే ప్రశ్నించే అవకాశముందని కూడా పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దుష్యంత దవే వాదనలు విన్పిస్తారని కోర్టు ఏజీ తెలిపారు. 2023-24 బడ్జెట్‌కు సంబంధించి గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై కొద్ది రోజులుగా రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ మధ్య విభేదాలు నెలకొన్నాయి.

