దున్నపోతు కోసం రెండు గ్రామాలు మధ్య కీచులాటలు
అనంతపురం జిల్లా కన్నేకల్లు మండలంలోని అంబాపురం, రచ్చుమర్రి గ్రామాల మధ్య ఒక దున్నపోతు కారణంగా తీవ్రవివాదం జరుగుతోంది. ఈ గ్రామాలలో ఐదేళ్లకొకసారి ఊరి జాతర జరుపుతారు. జాతర జరిగిన నెల తర్వాత అమ్మవారి పేరున మూడునెలల వయస్సు గల దున్నపోతును కొని, గ్రామంలో వదిలేస్తారట. తర్వాత వచ్చే ఐదేళ్ల జాతరకు ఆ దున్నపోతును అమ్మవారికి బలిఇవ్వడం వారి సంప్రదాయం. అయితే అంబాపురం గ్రామంలో వదిలిన దున్నపోతు నెలరోజులగా కనిపించడం లేదు. వివిధ ప్రాంతాలలో వెతికి, చివరకు బొమ్మనహల్ మండలం కొలగాన హళ్లిలో కనిపించిన దున్నపోతును తీసుకెళ్లిపోయారు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే రచ్చుమర్రి గ్రామస్తులు కూడా ఆ దున్నపోతు తమదేనంటూ గొడవకు దిగారు. చివరకు ఈ వివాదం ముదిరి, పోలీస్ స్టేషన్కు చేరింది. అంబాపురంలో ఈ నెల 17 న కొల్లారమ్మ జాతర జరగబోతోంది. తేదీ దగ్గర పడుతోందని కంగారు పడుతున్నారు అంబాపురం వాసులు. రచ్చుమర్రి గ్రామస్తులు కూడా రెండు నెలల్లో తమ జాతర ఉందని, ఆ దున్నపోతు లేకుండా జాతర ఎలా జరుగుతుందని నిలదీస్తున్నారు. పోలీసులు వారి మధ్య రాజీ కుదర్చాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.