“మీ అందానికి నా ప్రేమని పంపిస్తున్నా” సమంత కౌంటర్
“అందం శాశ్వతం కాదంటూ” సమంత ఇచ్చిన కౌంటర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న వయస్సులోనే ఎంతో మానసిక పరిణితి సాధించింది. అక్కినేని వారి ఇంటి కోడలుగా అడుగుపెట్టి ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఇంతలోనే నాగచైతన్యతో విడాకులు తీసుకుని సంచలనం సృష్టించింది. తనను విమర్శించేవారికి సరైన సమాధానాలు చెపుతూ అలసిపోయింది. ఈమధ్యనే ‘మయోసైటిస్’ అనే వ్యాధితో పోరాడుతూ నెలల తరబడి చికిత్స తీసుకుంది. తనకు ఓపిక లేకపోయినా శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్కు విచ్చేసింది. ఆమెను చూసి అభిమానులు ఎంత సంబరపడ్డారో, ఆమె కూడా అంతే సంతోషపడింది. ఆనందభాష్పాలు రాల్చింది. సినిమానే తనకు ప్రాణమని తెలియజేసింది.

అయితే ఆమెకు ‘మయోసైటిస్’ వ్యాధి కారణంగా అందం తగ్గిపోయిందని, మెరుపు కోల్పోయిందని ఒక నెటిజన్ జాలి కురిపించాడు. అయితే అతని జాలి చూపులకు తగిన జవాబు చెప్పింది సమంత. మీకు నాకు జరిగినట్లు నెలల తరబడి ట్రీట్మెంట్ తీసుకునే అవసరం రాకూడదని కోరుకుంటూ, నా ప్రేమను పంపిస్తున్నానని సమాధానమిచ్చి, వాళ్ల నోటికి తాళం వేసింది.
సమంత ముఖ్యపాత్రలో దిల్ రాజు సమర్పిస్తున్న ఈ సినిమాను గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. శకుంతలగా సమంత కన్పిస్తుండగా, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఈ సినిమా మహాకవి కాళిదాసు రచించిన “అభిజ్ఞాన శాకుంతలం” సంస్కృత నాటకం ఆధారంగా నిర్మించబడింది. “శాకుంతలం” చిత్రం ఫిబ్రవరి 17 న విడుదల కాబోతోంది.