Andhra PradeshHome Page Slider

ఇకపై తిరుమలలో  బస భారమే

తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలో స్వామిదర్శనం, మొక్కులు తీర్చుకోవడానికి అక్కడి వసతి గృహాలలో బసచేసే భక్తులకి షాకిచ్చారు. వసతి గృహాలలో అద్దెరేట్లను దాదాపు రెట్టింపు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని వసతిగృహాలలో ఆధునికీకరణ పనులు చేపట్టారు. అవి పూర్తయి, వాడుకలోకి రాగానే వాటి అద్దెను భారీగా పెంచేశారు. నామమాత్రపు అద్దె చెల్లించి బస చేసే పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఇది భరించలేని భారమైంది. తిరుమలలోని అన్ని పాత వసతి కేంద్రాలను టెండర్లు ఆహ్వానించి ఏసీ, గీజర్ వంటి సదుపాయాలు కల్పించారు. నందకం, కౌస్తుభం వంటి వసతి గృహాలు కాస్త మధ్యతరగతి వారికి అందుబాటులోనే ఉండేవి. ఇప్పుడు వాటి అద్దె 500 రూపాయల నుండి 1000 రూపాయలకు పెంచుతున్నారు. ఇక కాస్త డీలక్స్ వసతులైన నారాయణగిరి, పద్మావతి వంటి గెస్ట్ హౌస్ అద్దెలను 750 రూపాయల నుండి 1700 రూపాయలకు పెంచారు. స్పెషల్ కాటేజెస్ అద్దెలు 2800 రూపాయలకు పెంచారు.

ఇక సాధారణ మధ్యతరగతి ప్రజలు బస చేసే రాంభగీచా, వరాహస్వామి, SSGH, ATC, HVDC వంటి కాటేజెస్  కూడా ఆధునికీకరించి, వాటి ధరలు పెంచబోతున్నట్లు సమాచారం. దీనితో సామాన్య భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. తిరుమలను ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రంగా పూజిస్తున్నామని, దానిని వ్యాపారకేంద్రంగా మార్చొద్దని కోరుకుంటున్నారు.