Home Page SliderPoliticsTelangana

మెజార్టీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌.. పోరాడి ఓడిన బీజేపీ… కాంగ్రెస్‌ వాష్‌ ఔట్‌..  

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు సెస్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 15 డైరెక్టర్‌ స్థానాల్లో నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపొందింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు సంబురాలు చేస్తున్నారు. అయితే సెస్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగైంది. ఒక్క డైరెక్టర్‌ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. కోనరావుపేట, వేములవాడ అర్బన్‌ మండలంలో గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్‌ చేతులారా చేజార్చుకుంది.

ఇదిలా ఉంటే… బీజేపీ పార్టీ అధికార పార్టీ అభ్యర్థులకు గట్టి పోటినిచ్చింది. చివరకు వరకు పోరాడి ఓడింది. ఎన్నికల ముందు నుంచి బీజేపీ నేతలు పట్టు సాధించలేకపోయారు. బీజేపీ అభ్యర్థుల లిస్ట్‌ను కూడా నామినేషన్ల చివరి రోజు వరకు కూడా ప్రకటించలేదు. సెస్‌ డైరెక్టర్‌ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ బీజేపీ సద్వినియోగం చేయలేకపోయిందన్న నేతలు విమర్శించుకుంటున్నారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందని చెప్పొచ్చు. మంత్రి కేటీఆర్‌ ఇలాకాలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దిడ్డి రమాదేవికి.. బీజేపీ పార్టీ అభ్యర్థి మోర శైలజ ముచ్చెమటలు పట్టించారు. మొదటి 3 రౌండ్లు వరుసగా లీడ్‌లో కొనసాగి.. బీఆర్‌ఎస్‌ నేతలను షాక్‌కు గురి చేశారు. సిరిసిల్ల పట్టణంలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే బీజేపీని వెనక్కి నెట్టి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లీడింగ్‌లోకి వచ్చారు. మరోవైపు సెస్‌ ఎన్నికల ఫలితాలపై జిల్లా నేతలతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ఈ క్రమంలో విజేతలతో కలిసి బీఆర్‌ఎస్‌ నేతలు హైరదాబాద్‌కు వెళ్ళనున్నారు. అదేవిధంగా సెస్‌ ఛైర్మన్‌ అభ్యర్థిని మంత్రి కేటీఆర్‌ రేపు ప్రకటించనున్నారు.  అయితే బీజేపీ నేతల ఆందోళనలతో కౌంటింగ్ ప్రక్రియ కాసేపు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్‌ కేంద్రం వద్ద బీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.