జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో రచ్చ రచ్చ..
జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశం మొదలైన వెంటనే నగరంలో నెలకొన్న సమస్యలపై బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కార్పొరేటర్లపై ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయిస్తున్నారంటూ మేయర్ పోడియాన్ని బీజేపీ కార్పొరేటర్లు చుట్టుముట్టారు. బీజేపీ కార్పొరేటర్ల తీరుపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఈ గందరగోళ వాతావరణం మధ్యే 2023-2024 వార్షిక బడ్జెట్‌కు జీహెచ్‌ఎంసీ ఆమోదం తెలపాల్సి వచ్చింది. దీంతో సభ్యులతో చర్చించకుండానే బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. దీంతో డౌన్ డౌన్ మేయర్ అంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేస్తుంటే.. మరోవైపు మోడీ డౌన్ డౌన్ అంటూ బీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. అజెండా జరిగిన రోజునే మీకు సవరణలు ఉంటే ఆ రోజే చెపాల్సిందని మేయర్ వ్యాఖ్యానించారు.

అనంతంరం ముగ్గురు సభ్యులతో ఛాంబర్‌కు రండి అంటూ మేయర్ ప్రతిపాదించి… అనంతరం 10 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ ఎటువంటి మార్పు రాలేదు. బీజేపీ సభ్యులు మేయర్ పోడియం చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సహనం కోల్పోయిన మేయర్ సభ్యుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఇదేనా మహిళకు ఇచ్చే గౌరవం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు వారి స్థానంలోకి వెళ్లక పోతే సభను వాయిదా వేస్తానని తెలిపారు. మేయర్‌కు బీజేపీ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే.. ఎలాంటి చర్చ లేకుండా బడ్జెట్ ఆమోదం జరిగిందని మేయర్ ప్రకటన చేశారు. మొత్తం 6224 కోట్లు బడ్జెట్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

