Home Page SliderNational

అరుణాచల్‌లో చైనా భూకబ్జాను అడ్డుకున్న భారత్

కబ్జాకోరు చైనాకు భూదాహం తీరడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా భూములను కబ్జా చేసుకుంటూ.. దేశాలను దేశాలను కలిపేసుకుపోయిన చైనా… అదే పంథా కొనసాగిస్తోంది. ఇప్పటికే ఎన్నో బలహీన దేశాలను నయానో, భయోనో బెదిరించిన చైనా… ఇప్పుడు ఇండియా భూభాగాలపై కన్నేస్తోంది. గతంలో లడఖ్ వద్ద భూములను కొట్టేసేందుకు ప్రయత్నించిన చైనా, ఈసారి అరుణాచల్ ప్రదేశ్‌పై కన్నేసింది. కబ్జా చేస్తే భూభాగం వచ్చేస్తోందన్న ఏకైక సూత్రీకరణతో డ్రాగన్ కంట్రీ సైన్యం చెలరేగిపోతోంది. ఐతే చైనా సైన్యం కదలికలను గమనించిన భారత సైన్యం.. భూభాగంలోంచి వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించింది. వెనక్కి వెళ్లకపోవడంతో ఇక నాలుగు తగిలించారు. దెబ్బకు డ్రాగన్ దేశం సైన్యం అరుణాచల్ సరిహద్దుల్లోంచి పరార్ అయ్యింది. గత వారం జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

సరిహద్దు వివాదంపై ఒక్కసారిగా చర్చించి జారీ చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఈరోజు ప్రారంభమైన వెంటనే పార్లమెంట్‌ సమావేశాలు వాయిదా పడ్డాయి. గత వారం తవాంగ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖని దాటుకొని వచ్చి ఇండియా భూభాగాన్ని కబ్జా చేసి… “యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి” చైనా బలగాలు చేసిన ప్రయత్నాన్ని భారత సైనికులు తిప్పికొట్టారని ప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌ భూభాగాన్ని చైనా సైన్యం భూకబ్జా చేయకుండా భారత సైనికులు అడ్డుకున్నారని, “చైనా సైన్యాన్ని తిరిగి తమ స్థానాల్లోకి వెళ్లిపోయేలా ఒత్తిడి చేశారని” రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉభయ సభల్లో ఒక ప్రకటనలో తెలిపారు. సరిహద్దుల్లో పరిస్థితి సాధారణ స్థితి నెలకొందన్నారు. చైనా-భారత్ సరిహద్దు పరిస్థితి ప్రశాంతంగా ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ చెప్పారు.

దౌత్య, సైనిక మార్గాల ద్వారా సరిహద్దు సమస్యపై ఇరుపక్షాలు చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. డిసెంబర్ 9న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో సైనికులు ఎవరూ చనిపోలేదని, తీవ్రంగా గాయపడలేదని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. సరిహద్దు ఘర్షణ జరిగిన వెంటనే ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా చైనాతో మాట్లాడిందని చెప్పారు. సరిహద్దులో ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన ఉద్ఘాటించారు. PLA మన భూభాగంలోకి చొరబడకుండా భారత సైన్యం “ధైర్యవంతంగా నిరోధించిందని… వారిని వెనక్కి వెళ్లిపోయేలా చేసిందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఇరుదేశాల సైన్యం కొట్లాటతో రెండు వైపులా కొంతమంది సిబ్బందికి గాయాలయ్యాయన్నారు. ఇండియా వైపు ఎటువంటి ప్రాణనష్టం లేదా తీవ్రమైన ప్రాణనష్టం జరగలేదని పార్లమెంట్‌కు తెలిపారు.

ఐతే రాజ్‌నాథ్ సింగ్ ప్రకటనపై ప్రతిపక్షాలు మండిపడ్డాయ్. చర్చ జరపనందుకు నిరసనగా వాకౌట్ చేశాయి. ప్రతిపక్షం కేవలం ప్రకటనతో సంతృప్తి చెందలేదని, కీలకమైన సరిహద్దు సమస్యపై చర్చ జరగాలని కోరిందని కాంగ్రెస్ పేర్కొంది. భారతదేశం-చైనా సరిహద్దు సమస్యపై థ్రెడ్‌బేర్ చర్చ కోసం ఇతర పార్లమెంటు వ్యవహారాలన్నీ నిలిపివేయాలని చాలా పార్టీలు డిమాండ్ చేశాయి. చర్చ జరిపేందుకు ప్రభుత్వం విముఖంగా ఉందని RJD ఎంపీ మనోజ్ ఝా అన్నారు. చైనా విషయంలో తనకు భయంగా ఉందని, ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఆరోపించారు ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.