బీఆర్‌ఎస్‌కి దైవశక్తి అవసరం.. అందుకే యాగాలు…
బీజేపీ పార్టీపై మరోసారి ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీజేపీకి మహిళలను కించపరచడం అలవాటేనని అన్నారు కవిత. సీఎం మమతా బెనర్జీని ప్రధాని మోదీ అవహేళన చేశారని… తనను కూడా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అవహేళన చేశారని విమర్శించారు. బండి సంజయ్ బతుకమ్మను అవమానించారని, ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. ప్రజలు సరైన సమయంలో బీజేపీ సమాధానం చెబుతారన్నారు. నిర్మలా సీతారామన్ వీక్ హిందీ గురించి కాకుండా.. వీక్ రూపాయి గురించి స్పందిస్తే బాగుంటుందని కవిత ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీకి దైవశక్తి అవసరమని, అందుకే యాగాలు చేస్తున్నామని కవిత పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్‌ఎస్ పార్టీలోకి చేరికలు ఉంటాయన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి బీఆర్‌ఎస్ ప్రత్యామ్నాయం కానుందన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తామని కవిత స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి పోటీ చేస్తానని కవిత చెప్పారు.