Andhra PradeshHome Page Slider

ఏపీలో పింఛన్ పెంపు, ఇకపై నెలకు రూ. 2,750

ఏపీ పింఛన్‌దారులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నెలనెల ఇస్తున్న పింఛన్లను జనవరి 1, 2023 నుంచి రూ. 2,750కి పెంచుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. పింఛన్ల పెంపుపై జగన్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకొంది. వైఎస్ జగన్ అధికారంలోకి రాక ముందు ఏపీలో నెలకు 2 వేల రూపాయల పింఛన్ అందేది. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ తాను అధికారంలోకి వస్తే 2 వేల పింఛన్ ఇస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. ఐతే నాటి చంద్రబాబు సర్కారు ఎన్నికలకు ముందు పింఛన్ మొత్తాన్ని ఒకేసారి రెండు వేల రూపాయలు చేసింది. దీంతో రాజకీయంగా ఇబ్బంది కలగుతుందని భావించిన జగన్… పింఛన్ ఎమౌంట్‌ను దశలవారీగా 3 వేల రూపాయలు చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ పింఛన్ల పెంపును వైసీపీ ప్రస్తావించింది. వృద్ధులు, వితంతులు, వికలాంగులకు మేలు కలిగించేలా నిర్ణయం తీసుకుంటామని నాడు వైసీపీ చెప్పింది. ఏపీలో ప్రస్తుతం 62 లక్షల 31 వేల మందికి నెల నెల ప్రభుత్వం పింఛన్ అందిస్తోంది. గతానికి భిన్నంగా ప్రజలు ఎవరూ కూడా ఇళ్లలోంచి బయటకు రావాల్సిన విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా తెల్లవారుజామునే అర్హులకు పింఛన్ డబ్బులను చేతికి అందిస్తున్నారు. జనవరి ఒకటి నుంచి పింఛన్ మొత్తాన్ని పెంచనున్నట్టు గతంలోనే జగన్ ప్రకటించారు. ఇక వైఎస్ఆర్ పశు బీమా పథకం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

భూముల రీసర్వే కోసం మున్సిపాల్టీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1301 చదరపు కిలో మీటర్ల విస్తర్ణంలో రెండు మున్సిపాల్టీలు 101 గ్రామాలతో బాపట్ల అర్బన్ అధారిటీ, 8 మున్సిపాల్టీలు, 28 మండలాల్లోని 349 గ్రామాలతో 7281 చదరపు కిలో మీటర్ల మేర పల్నాడు అర్బన్ అధారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకై జిందాల్ స్టీల్‌ను భాగస్వామిగా ఎంపిక చేసిన నిర్ణయానికి ఓకే చెప్పింది. ఇక టీటీడీలో కొన్ని శాఖలకు ప్రచారం కోసం చీఫ్ పీర్వో పోస్టు భర్తీకి గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ఈనెల 21న జగన్ పుట్టిన రోజు సందర్భంగా 8 తరగతి విద్యార్థులకు 5 లక్షల మందికి ట్యాబ్‌లో పంపిణీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్‌ తరగతులు, ఫౌండేషన్‌ పాఠశాలల్లో స్మార్ట్‌ టీవీ గదులు నిర్మించేందుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.