Andhra PradeshHome Page Slider

కార్యకర్తలను పట్టించుకోని వైసీపీ

◆ ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో గృహసారథుల నియామకం
◆ సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లు
◆ సరైన గుర్తింపు లేదని పెదవిరుస్తున్న క్యాడర్
◆ ఎమ్మెల్యేలకు కత్తి మీద సాములాగా గృహసారథుల నియామకం

ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ అధికారం చేపట్టే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ప్రయోగాలు చేస్తున్నారు. తన నిఘాబృందాల ద్వారా పలు నివేదికలు తెప్పించుకుంటూ ప్రతి నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ప్రతి ఇంటి గుట్టు తెలుసుకునేందుకు జగన్ మరోక ప్రయోగం చేయబోతున్నారు. ఇప్పటికే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించి వారితో స్థానికంగా ఉన్న కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందేలా చేయటం ఆయా కుటుంబాల వివరాలు సేకరించి ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారనే వివరాలు సేకరించేవారు. అలానే పార్టీ పరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలన్న, జనాన్ని సభలకు రప్పించాలన్న ,వాలంటీర్లతోనే చేపించేవారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింత లోతుగా సమాచారాన్ని రాబట్టేలా ప్రతి కుటుంబం పై దృష్టి కేంద్రీకరించేలా ప్రతి 50 కుటుంబాలకు ఇద్దరు గృహాసారథులను, ప్రతి సచివాలయానికి పార్టీకి అత్యంత సానుభూతిపరులైన ఇద్దరు పురుషులు ఒక మహిళతో ఒక ప్రత్యేక కమిటీని నియమించబోతున్నారు. అలా సచివాలయ పరిధిలో ఉండే ఆయా కుటుంబాల సమాచారాన్ని వెంటనే తెలుసుకొని పార్టీకి చేరవేసేలా ప్రణాళికలు రూపొందింస్తున్నారు.

అయితే ఇప్పుడు ఆ గృహసారుథులను ఎంపిక చేయటం, సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లను నియామకం చేయటం కొంతమంది శాసనసభ్యులకు కత్తి మీద సాములా మారింది.వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు దాటిన పార్టీ కోసం ఎంతో కష్టపడి ఎంతో కొంత సొంత డబ్బును పార్టీ కోసం ధార పోసిన కార్యకర్తలను పార్టీ అధిష్టానం కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ పట్టించుకోలేదని పలుమార్లు ఆ పార్టీ కార్యకర్తలు విమర్శలు చేశారు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ అధినేత ఇప్పుడు పార్టీపై దృష్టి పెట్టారని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న అభివృద్ధి లేకపోవడంతో ప్రజా వ్యతిరేకత పెరిగిందని దాని నివారణ కోసం ఇప్పుడు ప్రతి 50 కుటుంబాలను ఒక క్లస్టర్ గా తీసుకొని ఇద్దరు పార్టీ గృహాసారధులను, ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లను నియమించటానికి రంగం సిద్ధం చేశారని ,మూడున్నర ఏళ్లగా కనీసం పట్టించుకోకపోగా తమను ఇబ్బంది పెట్టి ఇప్పుడు పార్టీ కోసం మరల పనిచేయమనటం ఎంతవరకు భావ్యమని కార్యకర్తలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు.

కొంతమంది శాసనసభ్యులు కొన్ని పనుల నిమిత్తం తమ దగ్గరే డబ్బులు వసూలు చేసి పార్టీకి సంబంధంలేని వ్యక్తులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టి ఇప్పుడు కార్యకర్తలను ఉచితంగా పనిచేయమండటం పై కూడా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా జరిగే కార్యక్రమాలకు కార్యకర్తలను దూరం పెట్టారని పార్టీ కష్టకాలలో ఉన్నప్పుడు పార్టీ జెండా మోసి 2014 ,2019 ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసిన కూడా ఇప్పటివరకు ఎటువంటి గుర్తింపు లభించలేదని కార్యకర్తలు పెదవి విరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గృహసారథులను, సచివాలయ కన్వీనర్ లను నియమించిన వారు ఎంత మేర పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏ పార్టీ అయినా కార్యకర్తలను విస్మరిస్తే ఆ పార్టీ అధికారం కోల్పోక తప్పదని, వైసీపీ అధిష్టానం కాని, స్థానిక ఎమ్మెల్యేలు కానీ గడిచిన మూడున్నరేలుగా కార్యకర్తలను విస్మరించారని, మరి రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుపు కోసం ఆ పార్టీ కార్యకర్తలు 2019 ఎన్నికలలో లాగా పనిచేయకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఈనెల 20వ తేదీ లోపు సచివాలయ కన్వీనర్లను నియమించాలని జగన్ ఆదేశించడంతో శాసనసభ్యులు ఆ పనిలో బిజీ అయ్యారు. మరి గెలుపే లక్ష్యంగా కొత్త ప్రయోగం చేస్తున్న జగన్ ఈ విషయంలో సక్సెస్ అవుతారా లేదా అనేది చూడాల్సి ఉంది.