ఉచితాలను ప్రకటించిన వారిని గుజరాత్ తిరస్కరించింది
ఆమ్ ఆద్మీ పార్టీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సెటైర్లు వేశారు. ఉచితాలను ప్రకటించిన వారిని గుజరాత్ తిరస్కరించిందని అన్నారు. మోదీ నాయకత్వంలోని బీజేపీకి గుజరాత్ ఘనమైన విజయాన్ని అందించిందని అమిత్ షా తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న బీజేపీ పక్షాన రాష్ట్రం నిలిచిందన్నారు. గుజరాత్ ఎప్పుడూ కూడా చరిత్ర సృష్టిస్తూనే ఉంటుందని చెప్పారు. గత రెండు దశాబ్దాల కాలంలో అభివృద్దికి సంబంధించిన అన్ని రికార్డులను గుజరాత్ బద్దలు కొట్టిందన్నారు. మోదీ అభివృద్ధి మోడల్‌పై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ గెలుపు నిదర్శనమని అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్ 182 సీట్లలో 150 కి పైగా బీజేపీ గెలుపొందడంతోపాటు 1985లో కాంగ్రెస్ 149 సీట్ల రికార్డును బద్దలు కొట్టింది. కాంగ్రెస్ ఆల్ టైమ్ కనిష్ఠానికి 16కి పడిపోయింది. గుజరాత్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా గట్టి సవాల్ విసిరిన ఆప్ 4 స్థానాల్లోనే విజయం సాధించింది.

