గుజరాత్లో బీజేపీ 150 ప్లస్ స్థానాల్లో ఆధిక్యం
గుజరాత్లో బీజేపీ చరిత్ర సృష్టించబోతోంది. 1985 నాటి రికార్డును బీజేపీ బ్రేక్ చేస్తోంది. నాడు సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 149 స్థానాల్లో విజయం సాధించింది. తాజాగా బీజేపీ ఆ రికార్డును చెరిపివేస్తోంది. 182 స్థానాల్లో బీజేపీ ఇప్పటికే 154కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. మొత్తంగా గుజరాత్లో బీజేపీ ఏడోసారి అధికారం దిశగా అడుగులు వేస్తోంది. గతంతో పోల్చుకుంటే అత్యధిక స్థానాలు గెలిచి సగర్వంగా అసెంబ్లీలో కాషాయం పార్టీ కాలు పెట్టనుంది. సాయంత్రం 6 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ఆఫీసుకు రానున్నారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ ముఖ్యనేతలు హార్ధిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, టీమ్ ఇండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా లీడ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం 20 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. గత ఎన్నికల్లో 72 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి అందులో సగం సీట్లను కూడా గెలుచుకునేలా కన్పించడం లేదు. హస్తం పార్టీకి సుమారుగా 50 సీట్లలో కోత పడుతున్నట్టుగా కన్పిస్తోంది. ఆ మొత్తం సీట్లను బీజేపీ గంపగుత్తగా సాధించబోతోంది.

గత ఎన్నికల్లో 99 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ ఈసారి 150 స్థానాలు ఖాయంగా సాధించేలా ఉంది. గుజరాత్లో కాంగ్రెస్ ఓట్లను అటు ఆప్, ఇటు మజ్లిస్ రెండూ పార్టీలు పెద్ద ఎత్తున చీల్చినట్టుగా తెలుస్తోంది. ఇక గుజరాత్లో గెలిచితీరతామన్న ఆప్ పార్టీ మొత్తంగా ఖాతా తెరుస్తోంది. ఆ పార్టీ సుమారు ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గద్వి ఆధిక్యంలో ఉండగా.. ఆ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా మాత్రం వెనుకంజలో ఉన్నారు. ఇక భుజ్‌లో మజ్లిస్ అభ్యర్థి షకీల్ దూసుకుపోతున్నారు.