కంటే కూతుర్నే కనాలి..!
తండ్రికి కిడ్నీ దానం చేసిన కుమార్తె రోహిణీ
సింగపూర్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్
లాలూ కుమార్తె రోహిణీపై ప్రశంసల వర్షం
కూతురు లేదని బాధపడుతున్నామంటున్న నేతలు
కంటే కూతుర్నే కనాలిరా… మనసుంటే మగాడిలా పెంచాలిరా… కూతురు మైనస్ కొడకే ప్లస్సను తాతల నాటి లెక్కలు కాదు… కొడుకుల కోసం చేసిన ఖర్చు గోడకు వేసిన సున్నం కదరా… అన్నాడో సినీ కవి… కర్మభూమి భారతదేశంలో తండ్రికి పేరు తీసుకొస్తున్న ఎందరో ధీరలను మన చూస్తూనే ఉన్నాం. వారి గొప్ప తనాలను, త్యాగాలను నెమరవేసుకుంటూనే ఉన్నాం. తాజాగా జరిగిన ఘటన వింటే ఎవరికైనా కళ్లు చెమడ్చక మానవు. తండ్రిని బతికించుకోవడం కోసం తన కిడ్నీని దానం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది ఆ వనిత. ఆమె ఎవరో కాదు.. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయ రోహిణి ఆచార్య. 74 ఏళ్ల తండ్రిని కాపాడుకోవడం కోసం చేసిన పని అనన్యసామాన్యమైనది. తండ్రిపై కుతూరుకు ఉన్న ప్రేమ ఎంత గొప్పదో రుజువు చేసింది రోహిణి…
తండ్రికి కిడ్నీ దానంగా ఇచ్చి చరిత్ర సృష్టించారు రోహిణి ఆచార్య. తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల మధ్య ఉన్న తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు… కిడ్నీ మార్పిడి ద్వారా మాత్రమే ఆరోగ్యవంతుడ్ని చేసే అవకాశముంది వైద్యులు స్పష్టం చేశారు. ఏం చేసినా.. ఆయన బతకడం కష్టమన్నారు. దీంతో కుటుంబ సభ్యులంతా లాలూ విషయంలో ఏం చేయాలన్నదానిపై తర్జనభర్జనపడ్డారు. కానీ కుమార్తె రోహిణి ఆచార్య మాత్రం నేనున్నానంటూ ముందుకు వచ్చారు. ప్రజా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన తన తండ్రి ఆరోగ్యంగా ఉంటే.. దేశానికి ఇంకా ఎంతో సేవ చేయగలడని తాను నమ్ముతున్నానన్నారు రోహిణి. అందుకే తండ్రి కోసం ప్రాణాలు పోయినా పర్లేదంటూ కిడ్నీ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు.

రోహిణి ఔదర్యంపై పార్టీలకు అతీతంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రీయ జనతాదళ్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ తర్వాత లాలూ, తనయ రోహిణి ఇద్దరూ కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కేవలం 40 ఏళ్ల వయసులో ఉన్న రోహిణి తన తండ్రి కోసం కిడ్నీ దానం చేయడానికి ముందుకు రావడంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు జల్లు కురుస్తోంది. రోహిణి, కిడ్నీని లాలూ ప్రసాద్ యాదవ్‌కు అమర్చి… ఆపరేషన్ విజయవంతం కావడంతో ఇప్పుడు అందరూ రోహిణి ధైర్యాన్ని వేనూళ్ల కొనియాడుతున్నారు.

మొన్నటి వరకు లాలూ ప్రసాద్ యాదవ్‌ను తీవ్ర పదజాలంతో విమర్శించే ఫైర్ బ్రాండ్ బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ సైతం రోహిణి ఎందరికో ఆదర్శమంటూ ట్వీట్ చేశారు. “బేటీ హోతో రోహిణి ఆచార్య జైసీ” “రోహిణి ఆచార్య ఆదర్శవంతమైన కుమార్తె. నేను మీ గురించి గర్వపడుతున్నాను. మీరు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచారు” అని సింగ్ ట్వీట్ చేశారు.
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కూడా రోహిణిని ప్రశంసించారు. “నాకు కూతురు లేదు. ఈరోజు రోహిణి ఆచార్యను చూసిన తర్వాత నాకు కుమార్తె ప్రసాదించనందుకు దేవుడితో పోరాడాలనుకుంటున్నాను” అని దూబే ట్వీట్ చేశారు.
లాలూ పెద్ద కుమార్తె, మిసా భారతి, నిన్న సాయంత్రం శస్త్రచికిత్స తర్వాత ఫోటోలు, వీడియోలను ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, మిసా, రోహిణి తమ్ముళ్లు కూడా ఆసుపత్రి నుండి కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
“నాన్న కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం అయిన తర్వాత, అతన్ని ఆపరేషన్ థియేటర్ నుండి ICUకి మార్చారు. అక్క రోహిణి ఆచార్య, లాలూ యాదవ్ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రార్థనలకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు” అంటూ తేజస్వీ ట్వీట్ చేశారు.
ఆపరేషన్‌కు కొన్ని గంటల ముందు, రోహిణి తన తండ్రితో శస్త్రచికిత్సకు ముందు ఫోటోను పంచుకున్నారు. “రాక్ అండ్ రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మంచి జరగాలని కోరుకుంటున్నానని ఆమె ట్వీట్ చేశారు.
తేజస్వి యాదవ్, మిసా భారతి శస్త్రచికిత్స కోసం సింగపూర్‌లో అనారోగ్యంతో ఉన్న వారి తండ్రి వద్దే ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ యాదవ్‌కు ఈ ఏడాది ప్రారంభంలో కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. లాలూ యాదవ్ కోలుకోవాలని… అభిమానులు, పార్టీ కార్యకర్తలు ‘మహామృత్యుంజయ్ జపం’ చేశారు. లాలూ క్షేమం కోసం బీహార్ అంతటా దేవాలయాలలో ప్రార్థనలు జరిగాయి.