NationalNews

హెచ్‌సీయూలో విద్యార్థినిపై ప్రొఫెసర్‌ అత్యాచారయత్నం

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన ఓ ప్రొఫెసర్‌ యూనివర్సిటీతో పాటు దేశం పరువు తీశారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఛత్రపాణి చూరేత్‌ హెచ్‌సీయూలోని హిందీ విభాగంలో స్కూల్‌ ఆఫ్‌ హ్యుమానిటీస్‌ చదువుతోంది. అదే డిపార్ట్‌మెంట్‌లో హిందీ ఫ్యాకల్టీగా పని చేస్తున్న ప్రొఫెసర్‌ రవి రంజన్‌ ఆ విద్యార్థినిపై ఎప్పటి నుంచో కన్నేశాడు. పుస్తకం ఇస్తానంటూ క్యాంపస్‌ బయటికి రప్పించిన ప్రొఫెసర్‌ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడంతో కంగుతిన్న విద్యార్థిని అతి కష్టం మీద అతడి నుంచి తప్పించుకొని పారిపోయింది. విషయం స్నేహితులకు చెప్పిన బాధితురాలు వారి సలహాతో గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ఇలాంటి ఘటన జరగడం పట్ల విద్యార్థులు కంగుతిన్నారు. తమకు అధ్యాపకుల నుంచే రక్షణ లేకపోవడం పట్ల విద్యార్థినులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్‌ రవి రంజన్‌పై ఐపీసీ 354 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామని, ఆయనను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. యూనివర్సిటీ పరువు తీసిన ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.