Andhra PradeshNews

ప్రతిపక్షాలను ఇరకాటంలో పెడుతున్న జగన్

◆ సంక్షేమ ఫలాలు అందితేనే వైసీపీకి ఓటేయాలంటున్న అధినేత
◆ రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారిన జగన్ వ్యాఖ్యలు
◆ జగన్ జిల్లాల పర్యటనలతో వైసీపీ క్యాడర్లో నూతన ఉత్సాహం

ఏపీలో సీఎం జగన్ పలు బహిరంగ సభల్లో చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్‎గా మారాయి. కొన్ని వ్యాఖ్యలు ప్రధాన ప్రతిపక్షాలను ఇరకాటంలో కూడా పెడుతున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా సీఎం జగన్ ప్రతినెల నాలుగు జిల్లాలు ఎంచుకొని ప్రభుత్వం కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. సీఎం జగన్ ఆయా జిల్లాల్లో బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రతి జిల్లాలోని పార్టీ నేతలు కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. వెళ్లిన ప్రతి జిల్లాలోనూ దాదాపు 30 నిమిషాలు పార్టీకి పనిచేసిన నాయకులతో కలిసేందుకు కేటాయిస్తూ వారి సమస్యలను వింటూ వారితో ఫోటోలు దిగుతూ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. ముఖ్యమైన నాయకులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సామాన్య ప్రజలను కూడా ఆలోచింపచేసేలా తన సభలలో సరికొత్త వ్యాఖ్యలను చేస్తున్నారు.

సీఎం జగన్ తాజాగా ఒకటి రెండు జిల్లాల పర్యటనలో భాగంగా గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రతి ఇంటికి అందుతున్నాయో లేదో ఆయా వర్గాలకు చెందిన ప్రజలే పరిశీలించుకోవాలని క్షేత్రస్థాయిలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందితేనే తిరిగి వైసీపీకి ఓటేయాలని, ఎక్కడైనా అందలేదంటే తమకు ఓటు వేయవద్దని అంటూ సమావేశాల్లో ప్రజలకు సూచిస్తున్నారు. సరిగ్గా ఇదే అంశం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ ప్రధాన చర్చనియాంశంగా మారింది. సాధారణంగా ఆయా పార్టీలకు చెందిన అధినేతలు ముఖ్యమంత్రులు ప్రజలకు తాము ఎన్నో చేశామని కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లన్నీ తమ పార్టీకే వేయాలని పిలుపునిస్తూ ఉంటారు. ఈ తరహా పిలుపు రాజకీయాల్లో సర్వసాధారణంగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే సీఎం జగన్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయో లేదో ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలని ఆ దిశగా అభివృద్ధి ఫలాలు అందితేనే తమ ప్రభుత్వానికి తిరిగి ఆదరించాలని సరికొత్త మాటలతో పేద ప్రజలకు మరింత దగ్గర అయ్యేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలతో పాటు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా జగన్ సరికొత్త వ్యాఖ్యలపై చర్చ జరుగుతుంది. ఒకవైపు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా జోరు పెంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి, అంటూ ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎక్కడికక్కడ సభలకు భారీగా జనం తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ పెట్టే ప్రతి కార్యక్రమానికి కూడా యువత పరుగులు తీస్తున్నారు. అయితే వాటికి దీటుగా సీఎం జగన్ ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పలు బహిరంగ సభలను నిర్వహించి సరికొత్త పందాలతో ఘాటైన వ్యాఖ్యలతో విపక్షాలపై దూకుడు పెంచుతున్నారు. రానున్న ఎన్నికల్లో 175 కు 175 నియోజకవర్గాలు గెలిచేలా వ్యూహాలు అమలు చేస్తున్న జగన్ తాజాగా తనకు అనుకూలమైన అధికారులును కొత్త టీమ్‌ను కూడా నియమించుకున్నారు. కొత్త టీమ్‌తో భవిష్యత్తులో ఎన్నికల వ్యవహారాలన్నీ సిద్ధం చేసుకోవాలనేది సీఎం జగన్ భావనగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు తీసుకునే వినూత్న నిర్ణయాలు ప్రతిపక్షాలు ఇరకాటంలో పెడుతున్నాయి. మరి జగన్ చేస్తున్న వినూత్న వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఏ విధంగా కౌంటర్ ఇస్తాయో చూడాల్సి ఉంది.