NewsTelangana

కేసీఆర్‌కు చరిత్రలో ఇలాంటి కౌంటర్ ఎవ్వరూ ఇవ్వలేదు!

కేసీఆర్ రాజకీయల గుట్టు విప్పిన ఈటల
పార్టీలను మింగేసి నీతులు చెప్తావా?
మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తావా?
భార్యాభర్తలు స్వేచ్ఛగా మాట్లాడుకోనివ్వవా?
ఊడిగం చేస్తున్న పోలీసుల లెక్క తేలుస్తాం!
నాడు ఓటుకు నోటు.. నేడు ఎమ్మెల్యేల ఎర
కొందరు పోలీసులు హద్దు మీరుతున్నారు
పద్దతి మార్చుకోకుంటే. భవిష్యత్‌లో ఆగమే?

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్. కేసీఆర్ చేస్తున్న అరాచకాలపై ఈటల గళం విప్పారు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది ఎందుకని ప్రశ్నించారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలని, అన్నమోరామచంద్ర అని అలమడిస్తున్న పేదల బ్రతుకులు మారాలని… దేశంలోనే అణచివేతకు, దోపిడీకి గురైన తెలంగాణను సుసంపన్నం కావడానికన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే… తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రాజులాగా, ఒక చక్రవర్తిలాగా, మానవ హక్కులను ఉల్లంఘించి కేసీఆర్ పాలిస్తున్నాడంటూ దుయ్యబట్టారు. దోపిడి, సంపాదన తప్ప ఇంకో ధ్యాసే లేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో చివరికి ప్రతిపక్షాలలో ఉండే పార్టీలను ప్రలోభ పెట్టి, తాయిలాలు ఇచ్చి.. పార్టీలు ఉండంగా.. చట్టాలు ఉండగా వాటిని చుట్టబండలు చేసి.. ఐదు పార్టీలను కలిపేసుకున్నారన్నారు. వైసీపీ, సీపీఐ, బీఎస్పీ, టీడీపీ, చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా ఖతం పట్టించిన చరిత్ర కేసీఆర్‌దన్నారు. అసెంబ్లీలో ప్రజల పక్షాన గొంతు విప్పకుండా, ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ప్రతిపక్ష పార్టీలను ఖతం పట్టించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని… ఓటుకు నోటు అని ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ తీరు ప్రజాస్వామ్యం చరిత్రలో మాయని మచ్చ అంటూ మండిపడ్డారు.

హుజురాబాద్‌లో 6000 రూపాయలు మాకు రాలేదని రోడ్లు ఎక్కి ఓటర్లు ధర్నాలు చేశారన్నారు ఈటల రాజేందర్. మునుగోడు ఎన్నికల్లో ఓటు వేయమంటే రోడ్లు వేశారన్నారు. ఎల్బీనగర్లో నిబంధనలకు విరుద్ధంగా జీవోలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్‌దన్నారు. మునుగోడులో పోలీసుల సమక్షంలో డబ్బులు పంచి ఓటుకు వెలగట్టిన చరిత్ర నీదంటూ కేసీఆర్‌పై రాజేందర్ విరుచుకుపడ్డారు. పార్టీలకు, ప్రజాప్రతినిధులకు వెలగట్టిన చరిత్ర కేసీఆర్‌దను ఆక్షేపించారు. ఇతర పార్టీలపై కేసీఆర్ విమర్శలు చేయడం దారుణమన్నారు. ఒక పార్టీలో ఉన్నవారు ఇంకో పార్టీలోకి చేరేటప్పుడు పార్టీ నాయకులతో… తెలిసిన వారితో మాట్లాడుకుంటూ ఉంటారని… ఆ విషయాన్ని సాకుగా తీసుకొని టీఆర్ఎస్ సర్కారును… బీజేపీ పడగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పడం మూర్ఖత్వమన్నారు. పార్టీలను ఖతం పట్టించిన చరిత్ర మీది తప్ప వేరే వారిది కాదన్నారు. గవర్నర్ ప్రసంగం ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సభను బయటకు గెంటేసి.. బొల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టిన చరిత్ర మీదన్నారు. అసెంబ్లీలో స్పీకర్ హక్కులను కాపాడలేక పోతుంటే… మరమనిషి అన్నందుకే సస్పెండ్ చేశారన్నారు. శాసనసభలో ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతును కేసీఆర్ నొక్కుతున్నారన్నారు.

జాయినింగ్ కమిటీ చైర్మన్‌ నాతో అనేక మంది కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు పార్టీలోకి వస్తున్నామని సంప్రదిస్తారన్నారు ఈటల. స్వేచ్ఛగా, స్వతంత్రంగా వస్తే చేర్చుకుంటామేగానీ… ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించడం దొంగే దొంగ అన్నట్టు ఉందన్నారు. పచ్చకామెర్ల వానికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఫోన్ టాపింగులు చేస్తున్నారన్నారు. 16 మంది మంత్రుల మీద నమ్మకం లేకుండా పోయిందన్నారు. వ్యక్తిగత జీవితం లేకుండా.. భార్య భర్తలు మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా.. ఫోన్లు వినే దుర్మార్గపు ప్రభుత్వం ఇదన్నారు. ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, పార్టీ నాయకుల ఫోన్లను టాపింగ్‌లో పెట్టి నిత్యం ఆ ఫోన్లో వింటున్న వ్యక్తి కేసీఆర్ అన్నారు ఈటల. ఫోన్లను టాపింగ్ చేయమని? ఏ ప్రజాస్వామ్యం చెప్పిందని ప్రశ్నించారు ఈటల. వ్యక్తి స్వేచ్ఛను హరించిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని చట్టాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి అంటూ విమర్శలు గుప్పించారు.

నిప్పుకనికలు, సుద్దపూసలు చెప్తున్నా నలుగురు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచి.. ఏ పార్టీలోకి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? ఏమిచ్చావు? సమాధానం చెప్పాలన్నారు ఈటల రాజేందర్. ఆ నిప్పుకనికలు అంత గొప్పవాళ్లయితే… వారిని ఎందుకు ప్రగతిభవన్లో బంధించావన్నారు. 26 రోజుల పాటు లోపలే ఉంచుకున్నావని ప్రశ్నించారు. ఇంతకంటే సిగ్గుమాలినతనం ఇంకోటి లేదన్నారు ఈటల. ఏ పార్టీలో గెలిచారు? ఏ పార్టీలో కలిశారు? ఏ పార్టీ నాయకుల వెంట పోతున్నారో తెలుసుకోవాలన్నారు. ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం ప్రగతిభవన్‌లో స్కెచ్ వేసుకొని.. తనకు ఆరు ఏడు సంవత్సరాలుగా ఓటుకు నోటు కేసులో సహకరించిన పోలీసు అధికారులకు పని అప్పజెప్పి ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. సీనియర్ మోస్ట్ ఆఫీసర్లు దానికి ఇన్చార్జ్‌గా ఉన్నామని చెప్తున్నారు. గతంలో ఇట్లాంటి పనులకు పాల్పడిన అధికారులకు ఏ గతి పట్టిందో మీ అందరికీ తెలుసు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోలేరు. చట్టబద్ధంగా డ్యూటీలు చేయండి. వ్యక్తులకు బానిసలాగా పనిచేస్తే ప్రజలు క్షమించరని పోలీసులకు ఈటల వార్నింగ్ ఇచ్చారు.

ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనే ఆలోచన లేదన్నారు ఈటల. భాజాప్తా రాబోయే కాలంలో కేసీఆర్‌ను ఓడ్డగోట్టే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని నాలుగు కోట్ల ప్రజలు నమ్ముతున్నారన్నారు. రైతుబంధులు, బీమాలు, నీ మోసపు మాటలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. ఉప ఎన్నికల్లో వేల మందిని పెట్టుకుని, దిగ్బంధం చేసి గెలవచ్చు. కానీ జనరల్ ఎన్నికల్లో అలా ఉండదన్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో 88 గెలుచుకున్న… నీకు ఏడాదిలో ఎంపీ ఎన్నికల్లో జనం కర్రుకాల్చి వాతపెట్టిన విషయాన్ని మరచిపోవద్దన్నారు. ఇందిరా గాంధీలాంటి నాయకులను మట్టిలో కలిపిన దేశం భారతదేశమన్నారు. చైతన్యవంతమైన తెలంగాణ గడ్డమీద మీ ఆగడాలు, దౌర్జన్యాలు, మీ ప్రజాప్రతినిధులు ఊర్లలో వ్యవహరిస్తున్న తీరు చెల్లదుగాక చెల్లదన్నారు. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ తప్పించుకోలేరంటూ ఈటల రాజేందర్ తూర్పారబట్టారు.