NewsTelangana

ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేయాలి

సీఎం కేసీఆర్‌ కుమార్తె, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించాలని కోరుతూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ హైకోర్టు తలుపు తట్టారు. కవిత కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని.. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ మాట్లాడారని.. ఈ విషయం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అత్యంత ముఖ్యులు తనకు చెప్పారని అరవింద్‌ ఇటీవల బాంబు పేల్చారు. దానికి దీటుగా జవాబిచ్చిన కవిత ‘నాపై తప్పుడు ప్రచారం చేసి.. నా వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. అరవింద్‌ను చెప్పుతో కొడతా. ఎక్కడికి వెళ్తే అక్కడ మెత్తగా తంతాం. ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడిస్తాను’ అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఆ వెంటనే అరవింద్‌ ఇంటిపై దాడి చేసిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కిటికీ తలుపులు ధ్వంసం చేశారు. పూల కుండీలు పగులగొట్టారు. ఇంట్లోకి చొరబడి అన్ని గదుల్లోని ఫర్నీచర్‌, వస్తువులను ధ్వంసం చేశారు. ఈ దాడితో సంబంధం ఉన్న 9 మంది టీఆర్‌ఎస్‌ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో నుంచి 2 సిమెంట్‌ రాళ్లు, 2 టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాలు, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. కవిత రెచ్చగొట్టడం వల్లే టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇంతటి విధ్వంసానికి పాల్పడ్డారని.. ఆమెపైనా కేసు నమోదు చేయాలంటూ హైకోర్టులో అరవింద్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.