10 రోజుల్లో 52 కోట్ల ఆదాయం..!
కేరళలోని శబరిమల ఆలయానికి కాసుల వర్షం కురుస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి అయప్ప దర్శనానికి వస్తున్న భక్తులు భారీగా విరాళాలు ఇస్తున్నారు. దీంతో 10 రోజుల్లోనే రూ.52 కోట్ల ఆదాయం సమకూరిందని శబరిమల దేవస్థానం బోర్డు అధ్యక్షుడు అనంత్ గోపాలన్ చెప్పారు. ‘అప్పం’ విక్రయం ద్వారా రూ.2.58 కోట్లు, అరవణ విక్రయం ద్వారా రూ.23.57 కోట్లు, హుండీ ఆదాయం రూ.12.73 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు. గతేడాది కొవిడ్ కారణంగా భక్తులపై ఆంక్షల వల్ల ఆదాయం అతి తక్కువగా వచ్చింది.

ఆలయానికి వెళ్లే నాలుగు దారులూ తెరిచారు..
ఈ ఏడాది మండల-మకరవిలక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది. అప్పటి నుంచి అయ్యప్ప భక్తుల మణికంఠుని నామస్మరణతో శబరిగిరులన్నీ మారుమోగుతున్నాయి. మండల కాలం దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప భక్తులు ఇరుముడితో శబరిమల చేరుకుని స్వామి వారికి సమర్పించుకుంటున్నారు. వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం ఉత్సవాల నిర్వహణకే ఖర్చు చేశామని అనంత్ గోపాలన్ తెలిపారు. ఆలయానికి వెళ్లే నాలుగు దారులు తెరిచామని.. భక్తులు ఏ దారి నుంచి అయినా ఆలయానికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. శబరిమలను సందర్శించాలనుకునే అయ్యప్ప భక్తులు ఆన్‌లైన్ పోర్టల్ లేదా స్పాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు.

