కాపు నాయకులకు జగన్ గాలం
◆ టీడీపీని జనసేనను నిలువరించేలా వ్యూహాలు
◆ టీడీపీ జనసేన పొత్తు కలిసిన ఇబ్బందులు లేకుండా ఎత్తులు
◆ విశాఖపట్నంపై పూర్తి దృష్టి, క్లీన్ స్వీప్ దిశగా అడుగులు
◆ వైసీపీలోకి గంటా శ్రీనివాసరావు మరి కొంతమంది టీడీపీ నాయకులు
ఏపీలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రాబోయే ఎన్నికలకు సంబంధించి తమ వ్యూహాలకు పదును పెడుతూ అధికారం పీఠం కైవసం చేసుకోవడానికి అడుగులు వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ పాలనాపరంగా పలు నిర్ణయాలు తీసుకోవటంతో పాటు పార్టీపై దృష్టి పెట్టి రానున్న ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. దీంతో ఆయన చూపు బలమైన కాపు నేతలపై పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సామెతను నిజం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ఇటు టీడీపీ నీ చావు దెబ్బతీస్తూనే జనసేన పార్టీని నిలువరించేలా ఆయన వ్యూహాలకు పదును పెడుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతలకు గాలం వేస్తూ వారిని టీడీపీ నుండి వైసీపీలోకి చేర్చుకోవడం ద్వారా టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బతీయాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే క్రమంలో కాపు సామాజిక వర్గ నేతలు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపకుండా వారిని తమ పార్టీ వైపు తిప్పుకోవటం ద్వారా ఆ పార్టీని కూడా నిలవరించాలని సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని అంటున్నారు. దీనికి కారణం గడచిన ఎన్నికల్లో జనసేనకు 6.5% శాతం ఓటింగ్ వచ్చిందని ఇప్పుడది 15% శాతం వరకు పెరిగిందని తనకు అందిన నివేదికల ద్వారా తెలుసుకున్న జగన్ ఆ క్రమంలో బలమైన కాపు నేతలను జనసేన వైపుకు వెళ్లకుండా నిలువరిస్తే తన పార్టీకి మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మిషన్ 175ను సుసాధ్యం చేయాలంటే ఎన్నో వ్యూహాలు అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో కాపు నేతలకు జగన్ గాలం వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలహీనపరచటంతో పాటు జనసేన హవాను కూడా నిలువరించే విధంగా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఇందులో భాగంగానే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును వైసీపీలోకి ఆహ్వానించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు వచ్చే నెలలో అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఆయన కూడా ఇప్పటికే తన అనుచరులతో రెండు మూడు సార్లు సమావేశమయ్యారని జగన్ ఆదేశాల మేరకే వైసీపీలో ఉన్న అగ్రనేతలతో విడివిడిగా సమావేశమయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన చేరికకు జగన్ కూడా ఓకే చెప్పారని ఇక అధికారికంగా చేరటమే తరువాయని ఏపీలో ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ 1న గంటా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే కొంతమంది మాత్రం డిసెంబర్ 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరగనుందని ఆ సందర్భంగా ఏర్పాటు చేసే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆయన అధికారికంగా సీఎం సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి.

గంటాతో పాటు విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ ముఖ్య నాయకులు కూడా ఆయనతోపాటు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, కరణం బలరామకృష్ణమూర్తి, మద్దాలి గిరిధర్ వైసీపీకి అనుబంధంగా ఉంటూ వస్తున్నారు. అలానే టీడీపీ మహిళా నేత పోతుల సునీత టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో ఆమెకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అలానే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా టీడీపీ నుండి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా టీడీపీలో ఉన్న బలమైన నాయకులతో పాటు కాపు నాయకులను కూడా వైసీపీలో చేర్చుకోవడం ద్వారా రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జగన్ సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే గంటా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన రాక ద్వారా విశాఖ ప్రాంతంలో వైసీపీ పార్టీకి మరింత బలం చేకూరుతుందని అధిష్టానం బలంగా నమ్ముతుంది. ఏది ఏమైనప్పటికీ గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరితే టీడీపీ నష్టపోయే అవకాశం ఉందని వైసీపీకి మాత్రం విశాఖలో ఇప్పుడున్న దానికంటే అదనంగా బలం పుంజుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

