ఇక సెలవు.. ముగిసిన కృష్ణ అంత్యక్రియలు..
అభిమానుల అశ్రునయనాల మధ్య సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పోలీసులు గాల్లో కాల్పులు జరిపి గౌరవవందనం సమర్పించారు. వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. కృష్ణ అమర్ రహే నినాదాలతో హోరెత్తించారు. కృష్ణ తనయుడు మహేశ్ బాబు తండ్రి చితికి నిప్పటించారు. అంతకుముందు పద్మాలయా స్టూడియో నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. భారమైన హృదయాలతో కృష్ణ అభిమానులు సూపర్ స్టార్‌ను సాగనంపారు. దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూ అభిమానం చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి అభిమానులు కృష్ణ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కడసారి తమ అభిమాన హీరోను చూసి ఫ్యాన్స్ కంటతడి పెట్టారు. ఇక సెలవంటూ వీడ్కోలు పలికారు.
