NewsTelangana

రాజాసింగ్ బుల్లెట్ వాహనం బ్రేక్‌డౌన్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం చెడిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనం తరుచూ రిపేర్‌కు వస్తోందని… ఉగ్రవాదుల నుంచి తనకు ప్రాణహాని ఉన్నప్పటికీ నాసిరకంగా వాహనాన్ని ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీరుపై రాజాసింగ్ మండిపడ్డారు. ప్రాణహాని ఉందన్న నేపథ్యంలో ఇచ్చిన బుల్లెట్ వాహనం పదేపదే బ్రేక్ డౌన్ కావడంతో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో కేటాయించిన వాహనం ఎక్కడికక్కడే ఆగిపోతోందన్నారు. గతంలో వాహనం రిపేర్ వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్‌కు తిరిగి పంపించినా… పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదన్నారు. అధికారులు రిపేర్ చేశామని చెప్పినా.. వాహనం మాత్రం ముందుకు కదలడం లేదన్నారు. వాహనం మొరాయిస్తూనే ఉందన్నారు. నాంపల్లి కోర్టుకు వెళ్లే సమయంలోనూ వెహికల్ ఆగిపోతే.. గన్‌మెన్ల సాయంతో ఆటోలో వెళ్లానన్నారు. ఏదైనా జరగకూడనిది జరిగితే తన భవిష్యత్ ఏమవుతుందని ఆక్రోశం వెళ్లగక్కారు. పీడీ యాక్ట్ కింద అరెస్టైన రాజాసింగ్‌కు గత బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విడుదల తర్వాత ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు రాజా‌సింగ్‌ను ఆదేశించింది.