వెలుగుల ఉత్సవం.. కార్తీక దీపోత్సవం
ఆరా ఫౌండేషన్,హెచ్ఎంటీవీల ఆధ్వర్యంలో
కార్తీక దీపోత్సవం, శివపార్వతుల కళ్యాణం
అశేష మహిళాశక్తి, విశేష ఆధ్యాత్మిక ఆసక్తి, అఖండ జ్యోతి
ఈనెల 21న చిలకలూరిపేటలో సాయంత్రం 4 గంటల నుండి
కార్తీక మాసంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం అంటారు. అదే ఒకే చోట.. ఓ వెలుగుల ఉత్సవం కార్తీకదీపోత్సవం జరిగితే వేలాది మంది ఒకేచోట చేరి దీపాలు వెలిగిస్తే.. అదే అసలైన ‘కార్తీక దీపోత్సవం’ అవుతుంది. దీపంను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కార్తీకమాసంలో దీపోత్సవం చేస్తే శ్రీమహాలక్ష్మీ కరుణాకటాక్షలు సిద్దిస్తాయని భక్తుల నమ్మకం. పవిత్రమైన కార్తీకమాసంలో ప్రజలు నెల పొడవునా శివుడిని ఆరాధిస్తారు. పవిత్రమైన కార్తీకమాసంలో వేల దీపాల కాంతులతో భగవంతుణ్ణి జ్యోతి రూపంలో ఆరాధిస్తే సకల కార్యాలు సిద్దించి పుణ్యగతులు లభిస్తాయని భక్తుల విశ్వాసం కూడా. అలాంటి పరమ పవిత్రమైన దీప యజ్ఞాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా ఆరా ఫౌండేషన్ – హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో కార్తీక దీపోత్సవం ఈనెల 21 సోమవారం సాయంత్రం RVSCVS హైస్కూల్ గ్రౌండ్ నందు జరుగబోతోంది.

ఈ ఉత్సవంలో సంధ్యా సమయంలో దీపాలు ఓ కాంతివనంలా వెలుగనున్నాయి. ఓంకారానికి లయబద్ధంగా సాగే శంఖారావాలు, డమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణాలు, జగద్గురువుల అనుగ్రహ భాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళశాసనాలు ఈ దీపోత్సవానికి ఆధ్యాత్మిక శోభను సంతరించనున్నాయి. ఈ వేదికగా శివపార్వతుల కళ్యాణం, మహాదేవునికి ప్రీతికరమైన అభిషేకాలు, విశేష పూజల వంటివి ఎన్నో భక్తుల మనసులను భక్తిపారశ్యంతో ముంచేయనున్నాయి. కార్తీకమాసం అంటే శివ పరమాత్మకు ఎంతో పవిత్రమైన మాసం అని ఈ మాసంలో దీపోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, భక్తి, శ్రద్ధలతో భగవంతుడికి దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని ప్రతీతి. అందుకే చిలకలూరిపేటలో ఈనెల 21న భక్తులందరినీ ఒకే చోటుకు చేర్చి ఈ కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు ఆరా ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ మస్తాన్ వలి (ఆరా మస్తాన్) తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా పాల్గొని ఆ పరమ శివుడి ఆశీస్సులు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.