InternationalNews

ట్విటర్‌ బ్లూటిక్‌ చార్జీ రూ.719 షురూ

ఎలాన్‌ మస్క్‌ ఆదేశించగానే ట్విటర్‌ చార్జీల మోతను ప్రారంభించింది. ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఉద్యోగులతో జరిపిన తొలి సమావేశంలోనే వినియోగదారుల నుంచి సర్వీసు చార్జీలు వసూలు చేయాలని మస్క్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో బ్లూటిక్‌కు చార్జీలను ట్విటర్‌ ప్రకటించింది. అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ సహా పలు దేశాల్లో ఈ చార్జీలు అమల్లోకి వచ్చాయి. బ్లాటిక్‌ చార్జీలు చెల్లించాలంటూ భారత్‌లోని కొందరు ట్విటర్‌ యూజర్లకు కూడా మెసేజ్‌లు వచ్చాయట. బ్లూటిక్‌ వినియోగిస్తే నెలకు రూ.719 చెల్లించాలంటూ ఐ ఫోన్‌ వాడుతున్న భారతీయులకు ట్విటర్‌ నుంచి మెసేజ్‌ వచ్చినట్లు సమాచారం. బ్లూటిక్‌ను కొనసాగించాలనుకుంటే ఈ చార్జీలు చెల్లించాల్సిందేనని ట్విటర్‌ స్పష్టం చేసింది. వద్దనుకుంటే ఈ ఫీచర్‌ను రద్దు చేసుకోవచ్చు.

తనిఖీలు లేకుండానే బ్లూటిక్‌..

రానున్న రోజుల్లో ఈ చార్జీలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ‘ట్విటర్‌ బ్లూ’ కోసం సబ్‌స్క్రిబ్షన్‌ చార్జీలు చెల్లించిన వారికి ఎలాంటి తనిఖీలు లేకుండానే బ్లూటిక్‌ వస్తుంది. ఈ బ్లూటిక్‌ ఖాతాదారులకు పలు ప్రయోజనాలను ఎలాన్‌ మస్క్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే.. తనిఖీలు లేకుండా బ్లూటిక్‌ ఇస్తే నకిలీ ఖాతాలు పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కొందరు ముఖ్యమైన వ్యక్తులను గుర్తించేందుకు ట్విటర్‌ ‘అధికారిక’ గుర్తును ప్రవేశపెట్టింది. అయితే.. చాలా మంది ప్రభుత్వేతర వ్యక్తుల ఖాతాల్లోనూ ‘అధికారిక’ గుర్తు కనిపించడంతో దాన్ని ట్విటర్‌ వెనక్కి తీసుకుంది.