ప్రధాని సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి
◆ మూడు లక్షల మందితో ప్రధాని సభ
◆ ముఖ్యమంత్రి, గవర్నర్ లకు ప్రత్యేక ఏర్పాట్లు
◆ 15 వేల కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్ట్‌లను జాతికి అంకితం చేయనున్న ప్రధాని
◆ వైసీపి ఆధ్వర్యంలోని భారీ సభ ఏర్పాట్లు
◆ రాష్ట్ర పరిస్థితులను మోడీకి వివరించనన్న సీఎం జగన్
భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విశాఖపట్నం ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం మోడీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని తామై అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా నేడు, రేపు విశాఖలోని మకాం వేసి ప్రధాని పర్యటనను పూర్తిస్థాయి విజయవంతం చేసేందుకు కష్టించి పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6.25 కు విశాఖ విమానాశ్రయంలో ఐఎన్ఎస్ డేగాకు నరేంద్ర మోడీ చేరుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి వైయస్ జగన్, గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఇతర ప్రముఖులు ప్రధానికి సాదర స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ప్రధాని నేవీకి చెందిన చోలా సూట్ కు చేరుకోగా ముఖ్యమంత్రి నేరుగా పోర్టు అతిథి గృహానికి, గవర్నర్ ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకొని రాత్రికి బస చేస్తారు.

శనివారం ఉదయం 10:30 నుంచి 11.45 వరకు ప్రధాని సభ ,ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉంటాయి. వీటిలో వీరంతా పాల్గొనడం పాటు ప్రధాని ప్రసంగించే ముందు ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలకడంతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మూడు లక్షల మందితో ప్రధాని బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలియజేశారు. 3 ఎకరాల ప్రాంగణంలో ప్రధాని సభ కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా 15 వేల కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారని తెలియజేశారు. ఇది రాజకీయ సభ, ఎన్నికల సభ కాదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోడీ పర్యటనతో రాష్ట్రంలో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. గత ఎనిమిదేళ్లుగా విభజన అంశాలు పరిష్కారానికి నోచుకోక పోలవరం పూర్తికాక యధాతధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని పర్యటనతో కొత్త ఊపు సంతరించుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

విభజన అంశాల్లో ప్రధానంగా ప్రత్యేక హోదా, విశాఖపట్నం రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు కర్మాగారంతో పాటు, మెట్రో రైల్ ప్రాజెక్టులు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, జాతీయ విద్య వైద్య సంస్థలకు ఆర్థిక సహకార వంటి అంశాలు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి. ఈ అంశాలపై మరోసారి ప్రధాని దృష్టికి తేవటం ద్వారా తగిన హామీ పొందాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అంశాల వారీగా అవసరమైన అనుమతులు ఆర్థిక సాయం పై మరో విడత లిఖిత పూర్వకంగా ప్రధానికి వివరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలానే మూడు రాజధానుల అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంచగా నిలిచిన విశాఖ రైల్వే జోన్ తో పాటు మూడు రాజధానుల అంశానికి సంబంధించి ప్రధానమంత్రి ప్రస్తావించే అవకాశం లేదని రాష్ట్ర బీజెపి నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటంతో ఉద్యోగులు కార్మికులు ప్రధాని పర్యటనపై ఆశలు పెంచుకున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కూడా ప్రధానమంత్రి ఎటువంటి ప్రస్తావన చేయరని బీజెపి నేతలు అంతర్గత సంభాషణలో స్పష్టం చేస్తున్నారు. కేవలం 15,233 కోట్లతో 9 జాతీయ ప్రాజెక్టులను మాత్రమే ప్రధాన మోడీ శంకుస్థాపన పనులు ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు వారు చెబుతున్నారు. ప్రధాని విశాఖ పర్యటన అనంతరం మధ్యాహ్నం 12.25 గంటలకు బయలుదేరి తెలంగాణకు వెళ్ళనున్నారు.

