మళ్లీ మోదీ x కేసీఆర్.. ప్రొటోకాల్ వివాదం
12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం
ఆహ్వాన పత్రంలో ప్రధాని తర్వాత కేసీఆర్ పేరేది?: టీఆర్‌ఎస్
ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేసీఆర్ వెళ్లడం అనుమానమే
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మధ్య మళ్లీ ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. ప్రధాని ఈ నెల 12వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఈ అధికారిక కార్యక్రమానికి పంపిన ఆహ్వాన పత్రంలో ప్రధాని మోదీ తర్వాత సీఎం హోదాలో కేసీఆర్ పేరు పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిందని ట్విట్టర్ వేదికగా టీఆర్‌ఎస్ తీవ్రంగా విమర్శించింది. ఆహ్వానం సరిగ్గా పంపించకపోవడంతో ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రధాని గారూ.. ఉత్త చేతులతోనే వస్తారా..
‘అయ్యా ప్రధాని గారూ.. తెలంగాణకు ఉత్త చేతులతోనే వస్తారా..? ఏమైనా తెస్తారా..? తెలంగాణకు చేసిన చేసిన అన్యాయాలపై ఏం చెప్తారు..? విభజన చట్టం హామీల అమలు సంగతేమిటి..? నీతి ఆయోగ్ చెప్పిన నిధులు ఇచ్చేది ఎప్పుడు..? నిగ్గదీసి అడుగుతున్న తెలంగాణ సమాజం’ అంటూ ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్ ప్రశ్నల వర్షం కురిపించింది. రామగుండం ఫ్యాక్టరీలో తెలంగాణ రాష్ట్రం అధికారిక భాగస్వామి అయినప్పటికీ సీఎం హోదాలో కేసీఆర్‌ను ఆహ్వానించకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ప్రధానిపై టీఆర్‌ఎస్ విరుచుకు పడింది.

2021లోనే ఉత్పత్తి ప్రారంభించిన కర్మాగారం..
నిజానికి రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి 2021 మార్చి నెలలోనే ప్రారంభమైందని.. ఇప్పటి వరకు 10 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేసిందని టీఆర్‌ఎస్ గుర్తు చేసింది. ఇప్పుడు జాతికి అంకితం పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకునేందుకు మోదీ, బీజేపీ కుట్ర పన్నుతున్నారని టీఆర్‌ఎస్ విమర్శించింది. 2020 నవంబరులో హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌ను ప్రధాని సందర్శించినప్పుడు కూడా ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. కరోనా వ్యాక్సిన్లకు సంబంధించిన ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ను పిలవకపోవడంపై టీఆర్‌ఎస్ అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్ ఆహ్వానం పలకకుండా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఆ బాధ్యత అప్పగించారు.