అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు సుప్రీం ఓకే
దేశంలో అగ్రవర్ణ పేదలకు(ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సుప్రీం కోర్టు సమర్ధించింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల ప్రజలకు విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం వారం రోజుల్లో తీర్పు వెలువరించడం విశేషం. ఈ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో చేపట్టిన 103వ సవరణను సుప్రీం కోర్టు సమర్ధించింది. 2019లో ప్రారంభించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏకంగా 40 పిటిషన్లు దాఖలయ్యాయి.

కేంద్ర ప్రభుత్వానికి భారీ ఊరట..
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ సారథ్యంలో జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కూడిన ధర్మాసనం 4:1 నిష్పత్తిలో తుది తీర్పు ఇచ్చింది. అంటే.. నలుగురు న్యాయమూర్తులు రిజర్వేషన్లను సమర్ధించగా జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లలో ప్రత్యేక కోటా సరికాదని జస్టిస్ భట్ వాదించారు. మొత్తానికి సుప్రీంకోర్టు సమర్ధించడంతో ఈ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించినట్లయింది.