NewsTelangana

మునుగోడులో ప్రశాంతంగా పోలింగ్‌

మునుగోడులో ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం ఓటింగ్‌ నమోదైంది. సంస్థాన్‌ నారాయణపురం మండలం గుజ్జలో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు చాలా సేపు క్యూలో నిలబడాల్సి వచ్చింది. మరోవైపు మునుగోడులో డబ్బుల పంపకం, పట్టివేత ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద మహిళలు, వృద్ధులే ఎక్కువగా కనిపించారు. ఓటర్లు ఎండలో నిలబడకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద టెంట్లు వేశారు. అనారోగ్యానికి గురైతే ప్రథమ చికిత్స కోసం మందులు, వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది తీసుకొచ్చినా ఓటింగ్‌కు అనుమతి ఇచ్చారు.

ఓటు వేసిన కూసుకుంట్ల, స్రవంతి..

టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి దంపతులు రాయణపురం పరిధిలోని లింగవారి గూడెంలో.. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చండూరు మండలం ఇడికూడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. చండూరులో ఓటర్లకు కొందరు డబ్బులు పంచుతుండగా పోలీసులు వచ్చారు. దీంతో రూ.2 లక్షలను అక్కడే వదిలేసి దుండగులు పారిపోయారు. నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో రూ.10 లక్షల నగదు పట్టుబడింది. డబ్బులతో వెళ్తున్న కారును బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక ఫంక్షన్‌ హాల్‌లో స్థానికేతరులు డబ్బులు పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు. రూ.2.99 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చండూరులో డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. వరంగల్‌ నుంచి వచ్చిన టీఆర్‌ఎస్‌ వాళ్లు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.