Andhra PradeshNews

కరెంటు కాటుకు నలుగురు కూలీల బలి

అనంతపురం జిల్లాలో కరెంటు కాటుకు నలుగురు మహిళా కూలీలు బలయ్యారు. రాయదుర్గం తాలుకా బొమ్మనహాల్‌ మండలం దర్గాహోన్నూరు గ్రామంలోని ఓ రైతు పొలంలో ఈ ఘటన జరిగింది. కోసిన మొక్కజొన్న కంకులను కూలీలు ట్రాక్టర్‌లో వేస్తుండగా 33 కిలోవాట్ల విద్యుత్తు లైన్‌ తెగిపడింది. ఆ కరెంటు వైర్లు ట్రాక్టర్‌పై పడటంతో విద్యుదాఘాతానికి గురైన నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని బళ్లారి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన కూలీలు గ్రామస్థులకు సమాచారం అందించడంతో.. వాళ్లు విద్యుత్తు సిబ్బందికి చెప్పారు. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.

ఈ నెపం ఎవరిపైనో..

అనంతపురం జిల్లాలో విద్యుదాఘాతానికి బలవుతున్న వారు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు. జూలై నెలలో శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి గ్రామంలో వేరుశెనగ చేనులో కలుపు తీయడానికి వెళ్తుండగా ఆటలోపై కరెంటు తీగ పడి ఐదుగురు మహిళలు కాలిపోయారు. ఆ ప్రమాదానికి ఉడుత కారణమంటూ నెపాన్ని ఉడుతపై నెట్టేసి విద్యుత్తు అధికారులు తప్పించుకున్నారు. తాజా ప్రమాదంలో విద్యుత్తు  అధికారులు నెపం ఎవరిపైకి నెడుతారో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.